- సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్
- కేసును సీబీఐకు అప్పగించాలని ఆదేశం
- తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు
ఫాం హౌస్ కేసులో తెలంగాణ సర్కారుకు మళ్లీ ఎదురుదెబ్బ తగలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకు బదిలీ చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. కేసును సీబీఐకు అప్పగించొద్దంటూ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దాఖలు చేసిన అప్పీళ్లను న్యాయస్థానం కొట్టివేసింది. సింగిల్ జడ్జి తీర్పును తప్పుబట్టలేమని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందని, అందుకే తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని అడ్వొకేట్ జనరల్ సీజే ధర్మాసనాన్ని కోరారు. అయితే ఏజీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
2022 అక్టోబర్ 26వ తేదీన మొయినాబాద్ ఫాంహౌస్ లో తమను ప్రలోభాలకు గురి చేశారంటూ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు రామచంద్రభారతి, సింహయా జీ, నందకుమార్ లను అరెస్ట్ చేశారు. ఫాం హౌస్ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగడంలేదని, అందుకే కేసును సీబీఐకి అప్పగించేలా ఆదేశించాలంటూ నిందితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్ 2022 డిసెంబర్ 26న సిట్ ను రద్దు చేయడంతో పాటు కేసును సీబీఐకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి4న హైకోర్టు డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రాతపూర్వక వాదనలు సమర్పించేందుకు జనవరి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. ఈ రోజు కేసు విచారణ జరిపిన న్యాయస్థానం సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.