హైదరాబాద్, వెలుగు: ఆస్మాన్ జాహి పైగా భూములకు చెందిన 66 ఏండ్ల లిటిగేషన్‌ను ఇటీవల హైకోర్టు పరిష్కరించింది. భూమి భాగపంపిణీ నిమిత్తం 1958లో హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణను మూసివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. లేని భూమి కోసం కక్షిదారులు 66 ఏండ్లపాటు లిటిగేషన్‌ను కొనసాగించారని అభిప్రాయపడింది. రాజీ ద్వారా భాగపరిష్కారానికి అంగీకరించినప్పటికీ.. అసలు భూములే లేనపుడు భాగపరిష్కారమన్నది ఉండదని పేర్కొంది.
రెండు మక్తాల భూములను విడుదల చేసినట్టు కమిషనర్ ఆఫ్ సెటిల్‌మెంట్ సర్వే 1977లో ఇచ్చిన నివేదికను తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది. 2023లో నియమితులైన కమిషనర్ కమ్ కోర్టు రిసీవర్ సమర్పించిన నివేదిక ప్రకారం ఎలాంటి భూములు లేనందున 1958 నాటి కేసును కొనసాగించడం అనవసరమని, దాన్ని మూసివేస్తున్నామని పేర్కొంది.
1977 నివేదిక ఆధారంగా జారీ చేసిన తుది డిక్రీ చెల్లుబాటు కాదని పేర్కొంటూ 66 ఏండ్లనాటి పిటిషన్‌లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వి శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. 1959 ఏప్రిల్ 6న ప్రాథమిక డిక్రీలోని 230 నుంచి 254 వరకు ఆస్మాన్ జాహి పైగాకు అనుకూలంగా విడుదల చేసినట్లు ఎక్కడా లేదంది. కమిషనర్ ఆఫ్ సెటిల్‌మెంట్ సర్వే మక్తా భూములను రిలీజ్ చేస్తూ 1977 డిసెంబరు 30న ఇచ్చిన ఉత్తర్వులున్నాయని పిటిషనర్లు చెబుతున్నప్పటికీ 230 నుంచి 254 వరకు విస్తీర్ణం ఎంతో పేర్కొనలేదంది.
1977 నివేదిక ద్వారా విడుదలైందని చెబుతున్న పిటిషనర్లు దానికి సంబంధించిన ఆధారాలు చూపడంలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి భూములు విడుదలైతేనే భాగపరిష్కారం ఉంటుందని తెలిపింది. 2023లో రిసీవర్‌లు సమర్పించిన నివేదికను ఆమోదిస్తున్నామని పేర్కొంది. వారిని ఆ బాధ్యతల నుంచి విడుదల చేస్తున్నామని పేర్కొంది. కొనుగోలు చేసిన కక్షిదారులు చట్టప్రకారం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టవచ్చంటూ తీర్పు వెలువరించింది.