- చెరువులకు సంబంధించి సమగ్ర నివేదికివ్వాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: చెరువుల పూడ్చివేతకు సంబంధించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సమర్పించిన నివేదికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తనిఖీలకు వెళ్లిన రోజు ఎలాంటి పనులు జరగడం లేదని వివరణ ఇవ్వడ ఏమిటని మండిపడింది.
చెరువుల అంశంపై సమగ్ర నివేదిక అందజేయాలని పీసీబీని ఆదేశించింది. సుందరీకరణ పేరుతో హైదరాబాద్ షేక్‌పేట్ పరిధిలోని హమీద్‌కుంట, అంతగాని కుంట, బంజారా చెరువుల్ని పూడ్చేస్తున్నారంటూ బంజారాహిల్స్‌కు చెందిన డాక్టర్ హాసన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
దీనిని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక యారాతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ..సుందరీకరణ పేరుతో చెరువును చెత్తతో నింపేస్తున్నారని కోర్టుకు తెలిపారు. చెరువు మధ్యలోంచి నిర్మిస్తున్న నడక మార్గం పనుల నిలుపుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్ వాదిస్తూ.. చెరువుల సుందరీకరణ కోసం కేంద్రం ప్రత్యేక నిధులు విడుదల చేసిందన్నారు. అభివృద్ధి పనుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈ చెరువులపై పీసీబీ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం నివేదిక అందజేయాలని హైకోర్టు పీసీబీని ఆదేశించింది.