హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ అదనపు ఎస్పీ ఎన్.భుజంగరావుకు ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్య కారణాల నేపథ్యంలో జారీ చేసిన మధ్యంతర బెయిల్ గడువు గత వారంతో ముగియడంతో దాన్ని పొడిగించడానికి నాంపల్లి కోర్టు తిరస్కరిండచంతో భుజంగరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన సోమవారం విచారణ చేపట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. ఈ మేరకు భుజంగరావు మధ్యంతర బెయిల్‌ను ఈ నెల 28 వరకు పొడగిస్తూ ఉత్తర్వులిచ్చారు. అదే తేదీన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులోనే మరో నిందితుడైన పి.రాధాకిషన్‌రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.