ఐఏఎస్‌లకు హైకోర్టులోనూ చుక్కెదురు
క్యాట్ ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమన్న కోర్టు
రిలీవ్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలన్న పిటిషన్లు కొట్టివేత
ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలని ఐఏఎస్‌లకు సూచన
హైదరాబాద్, వెలుగు: డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులకు హైకోర్టులోనూ చుక్కెదురైంది. తమను రిలీవ్ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ఐఏఎస్‌లు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు బుధవారం కొట్టివేసింది. ఐఏఎస్‌లు వారికి కేటాయించిన స్థానాల్లో చేరాల్సిందేనని, కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) జారీ చేసిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొన్నది.
ఆలిండియా సర్వీసు ఉద్యోగుల కేటాయింపు అన్నది పరిపాలనా పరమైన నిర్ణయమని తెలిపింది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని పేర్కొంది. అధికారులు వినతులను పరిశీలించిన తర్వాతే కేంద్రం నిర్ణయం తీసుకున్నదని తెలిపింది. మార్గదర్శకాలకు, నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు జరిగాయన్న వ్యక్తిగత వివాదాలకు చెందిన పిటిషన్లు ప్రస్తుతం క్యాట్‌లో ఉన్నాయని, ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడ చెప్పవచ్చంటూ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో ఈ ఐఏఎస్లందరూ ఏపీకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.
క్యాట్ ఆర్డర్స్‌పై స్టే ఇవ్వలేం
.తమను ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ ఐఏఎస్ అధికారులు హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మధ్యాహ్నం జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్షీనారాయణతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు సీనియర్ లాయర్లు వాదనలు వినిపిస్తూ.. గతంలో ఇదే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం పట్టించుకోలేదన్నారు. కేంద్రం తమ వాదన వినకుండా నిర్ణయం తీసుకున్నదని చెప్పారు.
వన్‌మెన్ కమిటీ ఏర్పాటు చెల్లదని, దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా తమకు అందజేయలేదని తెలిపారు. ట్రిబ్యునల్‌లో నవంబరు 4న విచారణ ఉందని, అప్పటి వరకు రిలీవ్ చేయవద్దని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రస్తుత పిటిషన్ల ఆధారంగా స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎన్నటికీ తేలదని వ్యాఖ్యానించింది. ‘వివాదాన్ని తేలుస్తాం.. ముందు మీరు కేటాయించిన రాష్ట్రాల్లో చేరండి’ అని ధర్మాసనం సూచించింది.
‘‘మీరంతా బాధ్యతాయుతమైన అధికారులు.. వీ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగొద్దు. ఎవరు ఎక్కడ పనిచేయాలనేది కేంద్రం నిర్ణయిస్తుంది” అని బెంచ్ పేర్కొన్నది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ.. ముందు పిటిషనర్లు రిలీవ్ అయి కేటాయించిన రాష్ట్రాల్లో విధుల్లో చేరాలన్నారు. ఇది తుది తీర్పునకు లోబడి ఉంటుందని క్యాట్ ఇప్పటికే స్పష్టంగా పేర్కొన్నందున ఎలాంటి ఉత్తర్వులు అవసరంలేదని చెప్పారు. ఇప్పుడు స్టే ఇస్తే రాష్ట్రాలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
డీవోపీటీ నిర్ణయం ఎలా సరైందో పూర్తి వివరాలతో క్యాట్‌లో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం కేంద్రం తీసుకున్న పరిపాలనా నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్లు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.