రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి
  • ఫార్మాసిటీ ఏర్పాటుపై రైతులకు నిరసన తెలిపే హక్కు ఉందని వ్యాఖ్య 

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్‌‌నగర్‌‌లో రైతులు పాదయాత్ర నిర్వహించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్రలో నేరచరిత్ర ఉన్నవారు పాల్గొనరాదని షరతులు విధించింది. పాదయాత్ర అనుమతిని నిరాకరిస్తూ ఏసీపీ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను తదుపరి ఉత్తర్వుల వరకు అమలు చేయొద్దని చెప్పింది. గ్రీన్‌‌ ఫార్మా సిటీ ద్వారా కలిగే నష్టాన్ని పాదయాత్ర ద్వారా తోటి రైతులకు అవగాహన కల్పించడానికి అనుమతివ్వాలని పోలీసులకు ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట సమితి రైతులు వినతి పత్రం అందించారు.దీన్ని  నిరాకరిస్తూ ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉత్తర్వులిచ్చారు.

పోలీసుల ప్రొసీడింగ్స్ ను సవాలు చేస్తూ ఎం.సాయిరెడ్డి మరో ఇద్దరు హైకోర్టులో రిట్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌‌ను జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ..గ్రీన్‌‌ ఫార్మా సిటీపై నిరసన తెలపడంతో పాటు తోటి రైతులకు అవగాహన కల్పించే అవకాశం ఇవ్వడం లేదన్నారు. యాచారం మండలం మేడిపల్లి, నానక్‌‌నగర్, కుర్మిగూడ, తాటపర్తి గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నారని, దీనిపై రైతులకు అవగాహన కల్పించేందుకు పర్మిషన్‌‌ ఇవ్వడం లేదని చెప్పారు.కోర్టు స్పందిస్తూ... ఫార్మా సిటీపై నిరసన తెలిపే వారి హక్కును హరించరాదన్నారు. పాదయాత్రకు అనుమతించాలని పేర్కొంటూ.. విచారణను 31కి వాయిదా వేశారు.