- పలు షరతులతో మంజూరు చేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు నిందితులకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అడిషనల్ మాజీ ఎస్పీ నాయిని భుజంగరావు, మాజీ డీసీపీ పి.రాధాకిషన్ రావుకు పలు షరతులు విధిస్తూ బెయిల్ ఇచ్చింది. రూ.లక్ష చొప్పున రెండు ష్యూరిటీలు, పాస్‌పోర్టులను కింది కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. గురువారం జస్టిస్ కె.సుజన ఉత్తర్వులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చిలో భుజంగరావు, రాధాకిషన్ రావును పోలీసులు అరెస్టు చేశారు.
భుజంగరావుకు నాంపల్లి కోర్టు ఆగస్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి కోర్టుల ద్వారా మధ్యంతర బెయిల్ పొందుతూ వచ్చారు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. మరోవైపు, చంచల్‌గూడ జైలులో ఉన్న రాధాకిషన్‌రావు కూడా తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలనే పిటిషన్‌లో కూడా వేరుగా తీర్పు వెలువడింది.
ఇవీ ఇరుపక్షాల వాదనలు
భుజంగరావు తరఫు న్యాయవాది వాదిస్తూ..తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నందున రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. గత ప్రభుత్వంలోని పెద్దలు ఫోన్ ట్యాపింగ్ వెనుకున్నారని పోలీసులు చెబుతున్నా అది ఎవరో పేర్కొనలేదన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు వాదిస్తూ.. భుజంగరావు బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌కు పాల్పడ్డారని కోర్టుకు తెలిపారు.
2020లో రాధాకిషన్‌రావు పదవీ విరమణ చేశాక నాటి ప్రభుత్వ పెద్దలు టాస్క్‌ఫోర్సు అధికారిగా నియమించారని గుర్తుచేశారు. విచారణ ఇంకా కొనసాగుతున్న దశలో రాధాకిషన్‌రావు, భుజంగరావుకు బెయిల్ ఇవ్వడం సరికాదని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు ఇద్దరు నిందితులకూ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ వేర్వేరుగా తీర్పులు వెలువరించింది.