- మేడిగడ్డపై దాఖలైన ప్రైవేటు
- ఫిర్యాదులో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు సంబంధించి దాఖలైన ప్రైవేటు ఫిర్యాదు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ వ్యవహారానికి సంబంధించి కేసీఆర్, హరీశ్‌రావుతో సహా బాధ్యులపై దర్యాప్తు జరపాలన్న అభ్యర్థనతో దాఖలైన ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ చేపట్టాలంటూ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి జులై 10న తీసుకున్న నిర్ణయం అమలును నిలిపివేస్తూ మంగళవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రైవేటు పిటిషన్‌దారు నాగవెళ్లి రాజలింగమూర్తికి నోటీసులు జారీ చేస్తూ, విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.
ప్రైవేటు ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయగా.. రివిజన్‌పై విచారణ చేపట్టాలన్న జయశంకర్ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నిర్ణయాన్ని కొట్టివేయాలని కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపడుతూ జిల్లా జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. జిల్లా జడ్జి నిర్ణయానికి గల కారణాలను వివరించారని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తనకు పరిధిలేని పక్షంలో సంబంధిత అవినీతి నిరోధక కోర్టుకు ఫిర్యాదును పంపాల్సి ఉందని, దానికి విరుద్ధంగా కొట్టివేశారన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ ఫిర్యాదుపై విచారించే పరిధి తమకు లేదంటూ మేజిస్ట్రేట్ సరైన నిర్ణయమే తీసుకున్నారని చెప్పారు.
ఒకసారి మేజిస్ట్రేట్ అంతిమ నిర్ణయానికి వచ్చినప్పుడు దానిపై రివ్యూ చేసే పరిధి సెషన్స్ జడ్జికి లేదన్నారు. రివిజన్ పిటిషన్‌పై విచారించే పరిధి తక్కువగా ఉందన్నారు. ఈ వాదనలను విన్న న్యాయమూర్తి ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే మేజిస్ట్రేట్ ఫిర్యాదును కొట్టివేశారు. రివ్యూ పిటిషన్‌పై విచారణ చేపట్టాలంటూ జిల్లా జడ్జి తీసుకున్న నిర్ణయం సమర్థనీయం కాదని, అందుకే ఆ నిర్ణయం అమలుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.