- హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
- కఠిన చర్యలు వద్దని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశం
- పిటిషనర్ల నుంచి తిరిగి అభ్యంతరాలు స్వీకరించాలి
- 6 వారాల్లో ఎఫ్‌టీఎల్‌పై నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ లోని దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ లోని నిర్మాణాల కూల్చివేత చేపట్టబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ హామీని నమోదు చేసిన ధర్మాసనం కూల్చివేతలపై కఠిన చర్యలు తీసుకోరాదని లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఆదేశించింది. పిటిషనర్లకు అభ్యంతరాలను తెలియజేసేందుకు అవకాశం ఇవ్వాలని, ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు సంబంధించి 2014లో జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై గతంలోనే పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను తిరిగి లేక్ ప్రొటెక్షన్ కమిటీకి అందజేయాలంది. ఆ తర్వాత ఆరు వారాల్లోగా దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌పై తుది నిర్ణయం తీసుకోవాలంది.
ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు పిటిషనర్లు హాజరై అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలంది. ప్రభుత్వ రికార్డులకు చెందిన డాక్యుమెంట్స్ కూడా అందజేయాలంది. ఈ విధంగా పిటిషనర్లు అభ్యంతరాలు తెలియజేసిన ఆరు వారాలకు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారణ చేయాలని కమిటీని ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూల్చివేత చర్యలు తీసుకోబోమన్న ప్రభుత్వ హామీని హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసింది. హామీ మేరకు కూల్చివేత చర్యలు తీసుకోరాదని, కఠిన నిర్ణయాలు తీసుకోరాదని ఉత్తర్వులు జారీ చేసింది.
ఎఫ్‌టీఎల్ 160 ఎకరాలనడం అన్యాయం
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట గ్రామం సర్వే నెం 47లో దుర్గం చెరువుకు సంబంధించి ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారణ చేయకుండానే కూల్చివేతలకు నోటీసులు జారీ చేయడాన్ని అమర్ సొసైటీ ప్లాట్ ఓనర్ల అసోసియేషన్, మరో ఇద్దరు వేర్వేరుగా మూడు పిటిషన్లు వేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్, న్యాయవాది పి.రాయ్ రెడ్డి వాదించారు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంలోని మ్యాప్ ప్రకారం దుర్గం చెరువు విస్తీర్ణం 65 ఎకరాలు ఉందని, అయితే చెరువు విస్తీర్ణం 160 ఎకరాలని అధికారులు నిర్ధారించడం అన్యాయమన్నారు.
Also Read:-కావూరి హిల్స్ పార్క్‌లో కట్టడాలు నేలమట్టం
బిల్డింగ్ రూల్స్ 2012లో రావడానికి ముందే హెచ్‌ఎండీఏ పర్మిషన్‌తో నిర్మాణాలు చేస్తే ఇప్పుడు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయని చెప్పి కూల్చివేత నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు లేక్ ప్రొటెక్షన్ కమిటీ 2014 జూన్ 7న ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిందని, దీనిపై అప్పుడే పిటిషనర్లు 14 అభ్యంతరాలు చెప్పారన్నారు. అవి అలాగే ఉంచి కూల్చివేత చర్యలకు ఉపక్రమించడం చెల్లదన్నారు.
అక్టోబర్ 4లోగా అభ్యంతరాలివ్వాలి
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పి శ్రీధర్ రెడ్డి ప్రతివాదన చేస్తూ, చెరువులన్నింటి ఎఫ్టీఎల్స్ను 3 నెలల్లో నిర్ధారణ చేయాలని ఇదే హైకోర్టు ఒక పిల్‌లో ఆదేశించిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణాల కూల్చివేత చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, గతంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీకి సమర్పించిన అభ్యంతరాలను అక్టోబరు 4లోగా తిరిగి అందజేయాలని పిటిషనర్లను ఆదేశించింది.
ఆ తర్వాత 6 వారాల్లోగా ఎఫ్‌టీఎల్ నిర్ధారణ విషయంపై నిర్ణయాన్ని వెల్లడించాలని కమిటీని ఆదేశించింది. ఈలోగా కూల్చివేత చర్యలు ఉండబోమన్న ప్రభుత్వ హామీని కచ్చితంగా అమలు పర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్లపై విచారణను మూసివేస్తున్నట్లు వెల్లడించింది.