వరంగల్ బీజేపీ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని, సభలో ఎలాంటి ఘటనలు జరిగినా పిటిషనర్లదే బాధ్యత అని న్యాయస్థానం స్పష్టం చేసింది. సభకు వచ్చే వీఐపీలతో పాటు హాజరయ్యే వారందరి వివరాలు పోలీసులకు అందజేయాలని చెప్పింది. వర్సిటీలో జరుగుతున్న పరీక్షలకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంబులెన్స్ సర్వీసులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పార్కింగ్ సమస్యలు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే సభకు పోలీసుల పర్మిషన్ లేదన్న కారణంతో కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి రద్దు చేశారు. దీంతో బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. మీటింగ్కు పర్మిషన్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు విన్నారు. శనివారం ఆర్ట్స్ కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నందునే ప్రిన్సిపల్ సభ అనుమతి రద్దు చేశారని ఏజీ న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. కళాశాలకు ఒకటే ఎంట్రెన్స్ ఉందని, సభ వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కొంటారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బీజేపీ సభకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో యధావిధిగా జరగనుంది. ఈ భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.