కాంగ్రెస్ ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ధర్నాకు అనుమతినిచ్చింది. ధర్నాలో 300 మందికి మించి ఉండకూడదని తెలిపింది. ధర్నాలో ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. మళ్ళీ సభ ఎప్పుడు నిర్వహిస్తున్నారో పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.
సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునివ్వగా..పోలీసులు ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ధర్నాకు అనుమతిలేదంటూ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే పొలీసుల తీరుపై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటికి వచ్చి అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా తాను తిరగొద్దా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ధర్నా చౌక్ కు పోతున్నానని ఎవరు చెప్పారన్న రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని నిలదీశారు.