- ఢిల్లీ పోలీసులను ఆదేశించిన హైకోర్టు
- చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించొచ్చు
- జూన్ 12కు విచారణ వాయిదా వేస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురికి హైకోర్టులో ఊరట లభించింది. వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఢిల్లీ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ కేసులో చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించొచ్చు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అమిత్ షాను టార్గెట్ చేస్తూ రిజర్వేషన్ల అంశంపై ఫేక్ వీడియో క్రియేట్ చేసి ట్విట్టర్లో పోస్టు చేశారంటూ శింకూ శరణ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన మన్నె సతీశ్, అస్మ తస్లీమ్, పెండ్యాల వంశీకృష్ణ, పెట్టం నవీన్, కోయ గీత, శివకుమార్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపారు. సీనియర్ అడ్వకేట్ వినోద్ కుమార్ దేశ్‌పాండే, తూం శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
ఇదే అంశంపై ఏప్రిల్ 27న బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారన్నారు. ఏప్రిల్ 28న ఢిల్లీ పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వివరించారు. పిటిషనర్లను కావాలని కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టుకు విన్నవించారు. హైదరాబాద్ పోలీసులు రిజిస్టర్ చేసిన కేసులో నిందితులు జైలుకు వెళ్లారని, బెయిల్ కూడా వచ్చిందని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి.. నిందితులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఢిల్లీ పోలీసులకు ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేశారు.
షరతులతో కూడిన బెయిల్ మంజూరు
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో సీసీఎస్ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీశ్, పెట్టం నవీన్, అస్మ తస్లీమ్, కోయ గీతను శుక్రవారం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు రూ.10వేలు పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి సోమవారం, శుక్రవారం ఇన్వెస్టిగేషన్ అధికారుల ముందు హాజరుకావాలని సూచించింది.
కాగా, ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ కార్యకర్త అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్’ హ్యాండ్లర్, కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా కన్వీనర్‌గా అరుణ్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అరెస్ట్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్కం ఠాగూర్ ఖండించారు. అరెస్ట్‌పై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై మండిపడ్డారు. వెంటనే అరుణ్ రెడ్డిని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.