ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు ఏ దశలో ఉన్నయ్: హైకోర్టు

ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు ఏ దశలో ఉన్నయ్: హైకోర్టు
  • ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన అనర్హత పిటిషన్ల విచారణ ఏ దశలో ఉందో చెప్పాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న పూర్తి వివరాలు సమర్పించాలని సూచించింది. బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కూనం పాండు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

వీటిపై బుధవారం జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి విచారణ జరిపారు. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు తీసుకోవడానికి స్పీకర్‌ కార్యాలయం నిరాకరించింది. దీంతో వీరు కోర్టును ఆశ్రయించారు. చివరికి గవర్నమెంట్ అడ్వకేట్ ద్వారా అవి స్పీకర్‌ కార్యాలయానికి చేరాయి. ఆ తర్వాత పిటిషన్లపై స్పందించాలంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు, స్పీకర్‌ కార్యాలయానికి, ప్రభుత్వానికి ఏప్రిల్‌ 15న హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన జడ్జి.. ఎంక్వైరీని ఈ నెల 10కి వాయిదా వేశారు.