- పరిష్కార మార్గాలతో విచారణకు రండి
- రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
- స్టెరిలైజేషన్ చేసినంత మాత్రాన దాడులు ఆగవు
- నివారణ చర్యలు తీసుకోకపోతే ఉపేక్షించేది లేదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: జనంపై వీధి కుక్కల దాడులు అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్టేట్ లెవల్ కమిటీలు వేయడం కాదని.. దాడులు నివారించాలని తేల్చి చెప్పింది. పరిష్కార మార్గాలతో తదుపరి విచారణకు హాజరుకావాలని ప్రభుత్వాన్ని, జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది. ఈ అంశంపై కోర్టులకు పూర్తి స్థాయి అవగాహన ఉండదని, నిపుణుల కమిటీ చెప్పాల్సి ఉంటుందని వెల్లడించింది.
కుక్కల దాడులు నివారించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జె. అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ మేరకు బెంచ్ కీలక కామెంట్లు చేసింది.
రాష్ట్ర స్థాయిలో వేసిన ఆరు కమిటీలు.. జంతు జనన నియంత్రణ ప్యానెల్‌తో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని ధర్మాసనం సూచించింది. ఆ మేరకు సూచనలు చేస్తే వాటి ఆధారంగానే తాము తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. స్టెరిలైజేషన్ చేసినంత మాత్రాన కుక్కల దాడులు ఆగవని అభిప్రాయపడింది. బుధవారం కూడా ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేయడం కలిచి వేసిందని తెలిపింది.
కుక్కలు చేస్తున్న దాడులను ఎవరూ ఖండించడం లేదని, అయితే.. వాటిని ఎలా నియంత్రించాలన్నదే అందరి ముందు ఉన్న ప్రధాన ధ్యేయమని చెప్పింది. నిపుణులతో చర్చించి నిర్దిష్ట పరిష్కార మార్గాలతో విచారణకు హాజరుకావాలని ప్రభుత్వానికి సూచించింది. కుక్కల దాడుల నివారణకు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది.
రాష్ట్ర వ్యాప్తంగా 3.79 లక్షల కుక్కలున్నయ్
వీధి కుక్కల దాడులపై వనస్థలిపురానికి చెందిన ఎంఈ.విక్రమాదిత్య హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. 2023, ఫిబ్రవరి 19న బాగ్ అంబర్‌పేటలో స్టూడెంట్‌పై కుక్కలు దాడి చేయడంతో చనిపోయాడు. అదేవిధంగా పఠాన్‌చెరువులో ఒక కార్మికుడి కొడుకు కూడా కుక్కల దాడిలో మృతి చెందాడు. వీటిని కూడా హైకోర్టు పిటిషన్లుగా తీసుకున్నది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ వాదిస్తూ.. అనుమమ్ త్రిపాఠి వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్నదన్నారు.
యానిమల్ బర్త్ కంట్రోల్ నిబంధనలను ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు వివరించారు. ఆ రూల్స్ ప్రకారమే హైదరాబాద్‌లో ఉన్న ఆరు కేంద్రాల్లో కుక్కలకు స్టెరిలైజేషన్, ఇమ్యూనైజేషన్ చేసి మళ్లీ అదే ప్రాంతంలో వదిలేస్తున్నట్లు చెప్పారు. రోజుకు 200 కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,79,148 కుక్కలు ఉన్నాయన్నారు. వాటి దాడులు ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు.
జంతు సంక్షేమ సంఘాలతో కూడా చర్చలు జరిపి కుక్కల దాడుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. కుక్కల దాడులు నియంత్రించేందుకు స్టేట్ లెవల్ కమిటీలు ఏర్పాటు చేశామని వివరించారు.
ఎక్కడ ఎక్కువ దాడులు జరుగుతున్నయో చూడాలి
జీహెచ్‌ఎంసీ పరిధిలో వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేశారని మరో అడ్వొకేట్ వేణుమాధవ్ వాదించారు. రోజుకు 30 నుంచి 40 కుక్కలకు వ్యాక్సినేషన్ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల వరకు కుక్కలు ఉంటాయని, ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కుక్కలు ఉన్నాయో ఇప్పుడు లెక్కించాలా? అని ప్రశ్నించింది. ఇది పిల్ అని.. ప్రచార పిటిషన్ కాదని వ్యాఖ్యానించింది.
ఎక్కడ ఎక్కువగా దాడులు జరుగుతున్నాయో తేల్చి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బాధితులను ఆదుకునేందుకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని కోరింది. ప్రభుత్వం ఏర్పాటు కమిటీలతో యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయి సమస్యకు పరిష్కారం చూపాలని సూచించింది. కుక్కలను షెల్టర్ హోమ్స్‌కు తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు అడ్వకేట్ కోర్టును కోరారు. నాగ్‌పూర్‌లో దాదాపు 90వేల కుక్కలను షెల్టర్ హోమ్స్‌లో పెట్టినట్టు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న బెంచ్.. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.