- ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయలేమంటూ హైకోర్టు కీలక తీర్పు
- అరెస్టు చెయ్యకుండాస్టే ఇవ్వాలన్న విజ్ఞప్తికి నో
- ఈ కేసులో కేటీఆర్‌పై తీవ్రమైన నేరాభియోగాలు నమోదైనయ్
- అందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నయ్
- దర్యాప్తు ఇంకా మొదటి దశలోనే ఉన్నది..ఇలాంటి పరిస్థితుల్లో అడ్డుకోలేం
- నిధులు ఎక్కడికి వెళ్లాయి? ఎవరికి చేరాయి? అనేది తేలాల్సిందే
- కేసు నమోదైన 24 గంటల్లోనే పిటిషనర్ కోర్టుకు వచ్చారు
- సాక్ష్యాధారాల సేకరణ కోసం దర్యాప్తు సంస్థకు టైమ్ ఇవ్వాలని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో ఉన్నతస్థాయి వ్యక్తులపై తీవ్రమైన నేరాభియోగాలు నమోదయ్యాయని, ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయని..ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు జరగాల్సిందేనని తేల్చి చెప్పింది.
కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నదని, దర్యాప్తు సంస్థ సాక్ష్యాధారాలు సేకరించేందుకు తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని.. ఈ దశలో తొందరపాటుతో దర్యాప్తును అడ్డుకోబోమని స్పష్టం చేసింది.
ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నేరాభియోగాలు నిజమా? కాదా? అనేది తేలాల్సి ఉన్నదని, అవన్నీ దర్యాప్తులోనే తెలుస్తాయని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు మంగళవారం 35 పేజీలతో తీర్పు వెలువరించింది.
ఫార్ములా–ఈ రేసులో అక్రమాలు జరిగాయంటూ పోయినేడాది డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అందులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంది.
అయితే కేసు నమోదైన తెల్లారే (డిసెంబర్ 20), దాన్ని కొట్టివేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు పూర్తవ్వగా, అదే నెల 31న హైకోర్టు తీర్పు వాయిదా వేసింది.
పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. అయితే ఆ టైమ్ లో కేటీఆర్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు జోక్యం చేసుకుని.. తీర్పుపై అప్పీల్ దాఖలు చేస్తామని, 10 రోజుల పాటు కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
కానీ అందుకు కోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసుల్లో తీర్పుపై అప్పీల్‌కు వీలుగా నిందితులను 10 రోజుల పాటు అరెస్టు చేయకుండా ఉత్తర్వులివ్వలేమని తేల్చి చెప్పింది.
కోర్టులు మినీ ట్రయల్ చెయ్యవు..
కేసు విచారణ ప్రాథమిక దశలో ఉండగా, కోర్టులు మినీ ట్రయల్ చెయ్యవని తన తీర్పులో హైకోర్టు పేర్కొంది. ‘‘ఈ కేసులో పిటిషనర్‌పై అధికారాల దుర్వినియోగం, బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించడం, హెచ్‌ఎండీఏ డబ్బును దుర్వినియోగం చేయడం, రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించడం, థర్డ్ పార్టీకి లబ్ధి చేకూర్చడం వంటి అభియోగాలు ఉన్నాయి.
పిటిషనర్‌పై ఐపీసీ సెక్షన్ 409, అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(1)(ఎ), 13(2) వంటివి నమోదయ్యాయి. ఈ నేరాభియోగాలు అర్హమైనవో? కాదో?తేల్చే పరిధి కోర్టులకు తక్కువ. బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 528 (సీఆర్పీసీ 482) కింద ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసే అధికారం కోర్టులకు పరిమితం. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీలుంటుంది.
కేసు విచారణ ప్రక్రియ దుర్వినియోగం అవుతున్నప్పుడు, చట్ట దుర్వినియోగానికి దారితీసే సందర్భాల్లో మాత్రమే చాలా అరుదుగా కోర్టుల జోక్యానికి వీలుంది. సెక్షన్ 528 కింద తన అధికారాన్ని వినియోగించి ఆరోపణలపై విచారణ చేపట్టబోదు. కోర్టే విచారణ బాధ్యతను తీసుకోదు. కోర్టు మినీ ట్రయల్ నిర్వహించలేదు” అని తీర్పులో పేర్కొంది.
దర్యాప్తు జరగాల్సిందే..
ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తీర్పులో హైకోర్టు పేర్కొంది. ‘‘బ్యాంకర్లు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్‌కు పాల్పడ్డారనే కోణంలో ఐపీసీ సెక్షన్ 409 కింద ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు జరగాల్సిందే. కేసు దర్యాప్తును అడ్డుకునే పరిధి కోర్టులకు చాలా తక్కువ. భజన్‌లాల్, నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఈ కేసుకు వర్తించవు.
14 నెలలు ఆలస్యంగా కేసు నమోదు చేశారనే కారణంతో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టి వేయలేం. లలిత కుమారి, చరణ్‌సింగ్ కేసుల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పులు ఇక్కడ వర్తించవు. మంత్రిగా చేసిన వాళ్లపై కేసు నమోదుకు వీల్లేదన్న పిటిషనర్ వాదన ఆమోదయోగ్యంగా లేదు.
హెచ్‌ఎండీఏకు చెందిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంగా ఉంది. ఆ ఒప్పందం జరిగినప్పుడు మున్సిపల్ మంత్రిగా పిటిషనర్ ఉన్నారు. ఆ మంత్రిత్వ శాఖ అధీనంలోనే హెచ్‌ఎండీఏ ఉంది.
ఈ వ్యవహారానికి సంబంధించిన నోట్‌ను మంత్రి హోదాలో పిటిషనర్ ఆమోదించారు. పిటిషనర్ మరొకరితో కలిసి కుట్రతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణ కూడా ఉంది. నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణల కేసుల్లో దర్యాప్తును అడ్డుకోవాలని కోరడానికి వీల్లేదు” అని తెలిపింది.
ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చెయ్యలేం..
ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలా? వద్దా? అనే అంశంలోకి వెళ్లే ముందు పిటిషనర్‌పై నమోదైన నేరాభియోగాలపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని తీర్పులో హైకోర్టు పేర్కొంది.
‘‘పిటిషనర్ నేరపూరితంగా వ్యవహించారా? లేదా? ఆయన నిజాయితీపరుడా? కాదా? ప్రజల ఆస్తి అయిన హెచ్‌ఎండీఏ నిధులను సొంతానికి మళ్లించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరిగాయా? లేదా? అనే విషయాలన్నీ దర్యాప్తులో తేలాల్సి ఉంది.
దర్యాప్తు పూర్తి కాకుండానే ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరడం చట్ట విరుద్ధం. దీనిపై దర్యాప్తు జరగాల్సిందే. ఎఫ్‌ఐఆర్‌లో ఏదైనా నిర్దిష్ట నేరాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. నేరారోపణపై ప్రాథమిక దర్యాప్తు జరగాలి.
ఆ ఆరోపణలపై సంతృప్తి చెందకపోయినప్పటికీ కోర్టు సదరు ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చెయ్యదు. కోర్టులు అసాధారణ పరిస్థితుల్లోనే ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేస్తాయి. దర్యాప్తు ఏకపక్షంగా, చట్ట వ్యతిరేకంగా జరిగిందని నిర్ధారణకు వచ్చినప్పుడు మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేస్తాయి.
ఈ కేసులో దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. పైగా ఈ కేసులోని అభియోగాలన్నీ తీవ్రమైనవి. ఫిర్యాదు చేసిన దానకిశోర్ ఉన్నతాధికారి. ఆయన ఉన్నత స్థాయిలోని వ్యక్తులపై ఫిర్యాదు చేశారు.
ఇలాంటి కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేసే అధికారం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే కోర్టులకు ఉంటుంది. ఇక్కడ అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. పైగా విదేశీ కంపెనీలకు ఆర్థిక శాఖ, కేబినెట్ అనుమతులు లేకుండానే నిధుల చెల్లింపులు జరిగిపోయాయి” అని చెప్పింది.
కేసు నమోదైన 24 గంటల్లోనే కోర్టుకు..
కేసు నమోదైన 24 గంటల్లోనే పిటిషనర్ కోర్టుకు వచ్చారని, కేసు దర్యాప్తు ప్రారంభం కాకుండానే దాన్ని కొట్టివేయాలని కోరడం సబబు కాదని తీర్పులో హైకోర్టు పేర్కొంది.
‘‘విదేశీ కంపెనీలకు భారీ మొత్తంలో ప్రజాధనాన్ని చెల్లించాలని హెచ్‌ఎండీఏను పిటిషనర్ ఆదేశించారనే అభియోగం ఉంది. రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఆమోదం పొందకుండానే సొమ్ము చెల్లించాలనే ఆదేశాలు వెలువడ్డాయి.
ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే నిధులు విడుదలయ్యాయి. పిటిషనర్ తనకు లేదా థర్డ్ పార్టీకి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో చెల్లింపులకు ఆదేశించారా? లేదా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కేసు నమోదైన 24 గంటల్లోనే పిటిషనర్ హైకోర్టుకు వచ్చారు.
కేసు దర్యాప్తు ప్రారంభం కాకుండానే ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని కోరారు. ఈ కేసులో పోయినేడాది డిసెంబర్ 18న ఫిర్యాదు అందితే, 19న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆ మరుసటి రోజే (20న) పిటిషనర్ హైకోర్టుకు వచ్చారు.
క్రిమినల్ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే దర్యాప్తు సంస్థ సాక్ష్యాలను సేకరించేందుకు సహేతుకమైన సమయం ఉండాలి. ఈ దశలో తొందరపాటుతో దర్యాప్తును అడ్డుకోలేం” అని తేల్చి చెప్పింది.
ప్రాథమిక ఆధారాలు ఉన్నయ్..
ఈ కేసులో కేటీఆర్ పై చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తీర్పులో హైకోర్టు పేర్కొంది. ‘‘ఇతర నిందితులతో కలిసి కేటీఆర్ కుట్ర చేసి హెచ్‌ఎండీఏ నిధులను దుర్వినియోగం చేశారన్నది ప్రధాన అభియోగం. ఎఫ్‌ఐఆర్‌లో అన్నింటికీ ఆధారాలు అవసరం లేదు.
ఏ ఒక్కటి ఉన్నా దాని ఆధారంగా తీగ లాగితే డొంక కదలొచ్చు. ఈ కేసును పరిశీలిస్తే కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఆధారా లున్నాయి. కేబినెట్, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే హెచ్‌ఎండీఏ నిధులను విదేశీ కంపెనీకి చెల్లించాలని కేటీఆర్ ఆదేశించారు.
ఇది స్వలాభం కోసం చేశా రా? లేక ఇతరులకు లబ్ధి చేకూర్చేందుకు చేశారా? అనేది దర్యాప్తులో తేలాలి. కేటీ ఆర్ అధికార దుర్వినియోగానికి పాల్ప డ్డారని, బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు స్పష్టంగా ఉన్నాయి.
కాబట్టి ఐపీసీ సెక్షన్ 409తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఎ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం కరెక్టే. ప్రభుత్వ ఆస్తి తన పరిధిలో లేదన్న కేటీఆర్ వాదనను ఈ దశలో ఆమోదించలేం. మున్సిపల్ శాఖ ఆధీనంలోనే హెచ్‌ఎండీఏ ఉంది.
ఆ శాఖ కు ఆనాడు మంత్రిగా కేటీఆరే ఉన్నారు. అగ్రిమెంట్‌కు ముందే నిధుల విడుదలకు సంబంధించిన నోట్ కు మంత్రిగా ఆమో దం చెప్పారు. కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ అయినట్టు వెల్లడైంది.
ప్రజా ఆస్తులకు సంబంధించి మంత్రి ప్రభుత్వ ప్రతినిధిగా ఉండాలని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. కానీ కేటీఆర్ వ్యవహరించిన తీరుతో ఆ విశ్వాసం దెబ్బతిన్నది” అని కోర్టు పేర్కొంది.
ఈ ప్రశ్నలకు దర్యాప్తులోనే జవాబు!
ఫార్ములా–ఈ రేసు నిర్వహించిన సంస్థ ఆర్థికంగా లబ్ధి పొందిందని, కానీ ఆ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదన్న పిటిషనర్ వాదనను ప్రస్తావిస్తూ.. ఈ వ్యవహారం ఏసీబీ దర్యాప్తులో తేలే అంశమని తీర్పులో హైకోర్టు పేర్కొంది. ‘‘నిధుల దుర్వినియోగం జరిగినట్టు అభియోగాలు ఉన్నాయి. ఫార్ములా–ఈ రేసు పేరుతో చెల్లించిన సొమ్ము ఎక్కడికి వెళ్లింది.
అది ఎవరికి చేరింది? రేసుపై నిర్ణయం తీసుకున్న కేటీఆర్‌కే ఆ సొమ్ము తిరిగి వచ్చిందా? అసలు ఏసీబీ నమోదు చేసిన అభియోగాల్లో నిజం ఎంతుంది? ఈ రేసు ఎవరి ప్రయోజనాల కోసం నిర్వహించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమా? లేదంటే ఒక్క వ్యక్తి కోసమా? ఇదీ కాకపోతే ఎస్ నెక్ట్స్ జెన్ సంస్థను రక్షించడానికే ప్రభుత్వ సొమ్ము చెల్లించారా? రూ.54.88 కోట్లు ప్రభుత్వ నిధులు తరలి వెళ్లింది వాస్తవమే.
రూల్స్ ఉల్లంఘించి చెల్లింపులు జరిగాయా? లేదా? సీజన్ 9 నిర్వహించిన స్పాన్సర్స్ సీజన్ 10 నిర్వహించే ముందు ఎందుకు తప్పుకున్నారు? అప్పటికప్పుడు ఆ బాధ్యతలను హెచ్‌ఎండీఏ ఎందుకు తీసుకుంది? మున్సిపల్ శాఖ అధీనంలోనే హెచ్‌ఎండీఏ ఉంది.
ఆనాడు ఆ శాఖ మంత్రిగా నిందితుడైన పిటిషనర్ ఉన్నారు. ఆనాడు మంత్రిగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయం కారణంగానే ఇవన్నీ జరిగాయా? లేదా? పిటిషనర్ చెబుతున్నట్టు నిధులు బ్యాంక్ ద్వారానే వెళ్తే.. అవి ఎక్కడికి వెళ్లాయి? ఎవరికి చేరాయి? చేరిన వాళ్ల నుంచి తిరిగి మరెవరికి వెళ్లాయి? మోసం ఎక్కడ జరిగింది? అసలు మోసం జరిగిందా? లేదా? ఒప్పందం కంటే ముందే చెల్లింపులు జరిగాయా?లేదా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అందుకే ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలన్న కేటీఆర్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం” అని పేర్కొంది.