చట్టం దృష్టిలో సరికాదు..కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు..జీవో16 కొట్టివేసిన హైకోర్టు

  • ఇకపై కాంట్రాక్ట్​ ఉద్యోగుల..రెగ్యులరైజేషన్​ చెల్లదు
  • గత  సర్కారు ఇచ్చిన జీవో  రాజ్యాంగ విరుద్ధం
  • జీవో 16ను కొట్టేస్తూ హైకోర్టు కీలక తీర్పు
  • ఇప్పటికే రెగ్యులరైజ్  అయినోళ్లకు నో ప్రాబ్లం
  • భవిష్యత్తులో రిక్రూట్​మెంట్స్​  అన్నీ చట్టప్రకారమే ఉండాలని ఆర్డర్​

హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్ట్​ ఉద్యోగుల రెగ్యులరైజేషన్​పై హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. రాష్ట్రంలో  కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవో చెల్లదని పేర్కొన్నది. సెక్షన్‌ 10 ఏను చేర్చుతూ 2016లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 16ను  కొట్టివేసింది. 

క్రమబద్ధీకరణ నిమిత్తం 1994 చట్టానికి సవరణ తీసుకువస్తూ సెక్షన్‌ 10ఏను చేర్చడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నది.  కాంట్రాక్ట్‌ కింద కొనసాగుతున్న జూనియర్‌ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని, ఇందుకోసం  జీవో 16 ద్వారా తీసుకువచ్చిన సెక్షన్‌ 10ఏను సవాల్​ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

వీటిపై జస్టిస్‌ సుజయ్‌పాల్, జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.  పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 2002 నుంచి జూనియర్, డిగ్రీ లెక్చరర్లను అధికారులు దొడ్డిదారిన నియమిస్తున్నారని తెలిపారు. 

కాలేజీ డెవలప్‌మెంట్‌ కమిటీ కింద కాంట్రాక్ట్‌ నియామకాలు జరిగాయని,  అనంతరం ఆ ఉద్యోగాలను రెగ్యులరైజ్​ చేశారని పేర్కొన్నారు.  ఈ పోస్టులకు ఎలాంటి నోటిఫికేషన్‌ జారీ చేయలేదని, అర్హతలు పేర్కొనలేదని చెప్పారు. చట్టానికి సవరణ తీసుకువచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని అన్నారు.

మరోవైపు ప్రభుత్వం తరఫున లాయర్​ వాదనలు వినిపిస్తూ.. పునర్‌‌‌‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌‌‌‌ 101 కింద కొత్త సెక్షన్‌‌‌‌ చేర్చే అధికారం రాష్ట్రానికి ఉందని తెలిపారు. ఉద్యోగుల పరిస్థితులతోసహా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఒక్కసారికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వ వాదనతో విభేదించింది. 

క్రమబద్ధీకరణకు అనుసరించిన విధానం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. చట్టబద్ధమైన నిబంధనలు ఉన్నప్పుడు వాటికి సమాంతరంగా మరో భిన్నమైన నిబంధనను చేర్చడం సరికాదని అన్నది.

చట్టం దృష్టిలో సరికాదు

కాంట్రాక్ట్​ ఉద్యోగుల రెగ్యులరైజేషన్..​చట్టం ప్రకారం సరికాదని హైకోర్టు బెంచ్​ వెల్లడించింది.   ఇది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమని తెలిపింది. రెగ్యులరైజేషన్​ నిమిత్తం నిర్ణయించిన అర్హతలు పారదర్శకంగా లేవని, అందువల్ల క్రమబద్ధీకరణ అధికారం చట్టానికి అనుగుణంగా ఉందని భావించలేమని తేల్చి చెప్పింది. 

సవరణ ద్వారా చేర్చిన సెక్షన్‌‌‌‌ 10 ఏ రాజ్యాంగ విరుద్ధమని, దీని కింద నియామకాలు చెల్లవని పేర్కొన్నది. ప్రస్తుత కేసుల్లో దాదాపు 2009లో సర్వీసులో చేరగా అనంతరం క్రమబద్ధీకరణ జరిగిందని, ఈ దశలో వారిని తొలగించినట్లయితే తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నది. జీవో 38 కింద దాదాపు 5,544 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగిందని, బహుళ ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నందున వారిని తొలగించొద్దని తీర్పు వెలువరించింది.