బీజేపీ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  • నేడు మూడో విడత పాదయాత్ర ముగింపు
  • హాజరుకానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
  • వరంగల్ చేరుకున్న బీజేపీ రాష్ట్ర కొత్త ఇన్‌‌చార్జ్ సునీల్ బన్సల్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ సభకు అడ్డంకి తొలగిపోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ముగింపు సభను ముందుగా అనుకున్నట్లుగా వరంగల్‌‌లో నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్‌‌ సిగ్నల్ ఇచ్చింది. శాంతి భద్రతల పేరుతో ఆఖరు నిమిషంలో పోలీసులు మీటింగ్‌‌కు అనుమతి రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. సభ పెట్టుకునేందుకు ఓకే చెప్పింది. దీంతో వరంగల్‌‌లో శనివారం యథావిధిగా బీజేపీ బహిరంగ సభ జరగనుంది. 

ప్రదర్శనలు, సభలు, ర్యాలీలను నిషేధిస్తూ పోలీ సులు జారీ చేసిన నోటిఫికేషన్‌ చట్ట వ్యతిరేకం. మా ముందున్న అంశాలను పరిశీలిస్తే సభకు అనుమతులు మంజూరు చేయడంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జాప్యం చేసే ప్రయత్నం ఉన్నట్లు అనిపిస్తున్నది. సభకు అనుమతి ఇచ్చి రద్దు చేశారు. ఇది సరికాదు. సభకు పర్మిషన్ ఇస్తూ వరంగల్‌ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేయాలి.
‑ హైకోర్టు

నితిన్‌‌, మిథాలీరాజ్‌‌తో ఇయ్యాల నడ్డా భేటీ 

శనివారం మధ్యాహ్నం 12. 40కి శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకోనున్న బీజేపీ చీఫ్ నడ్డా.. నోవాటెల్ హోటల్‌‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. అక్కడ బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2.40కి ప్రత్యేక హెలికాప్టర్‌‌‌‌లో వరంగల్‌‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3. 15 వరకు భద్రకాళి ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేయనున్నారు. 3.30కు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలతో భేటీ కానున్నారు. సాయంత్రం 4.10 నుంచి 5.40 గంటల వరకు సుబేదారిలోని ఆర్ట్స్‌‌ అండ్‌‌ సైన్స్‌‌ కాలేజీలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5. 55 గంటలకు వరంగల్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్‌‌లోని నోవాటెల్‌‌ హోటల్‌‌కు చేరుకుంటారు. అక్కడ సినీ నటుడు నితిన్‌‌, క్రికెటర్‌‌ మిథాలీరాజ్‌‌లతో భేటీ కానున్నారు.