మార్చి 3వ తేదీ వరకు ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసు దర్యాప్తు నిలిపివేత

మార్చి 3వ తేదీ వరకు ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసు దర్యాప్తు నిలిపివేత

హైదరాబాద్, వెలుగు:  ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ చేశారంటూ రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారి చక్రధర్‌‌ గౌడ్‌‌ ఇచ్చిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును మార్చి 3వ తేదీ వరకు నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌ రావును అరెస్ట్‌‌ చేయొద్దంటూ గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులనూ పొడిగించింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌‌లో నమోదైన కేసును కొట్టివేయాలని హరీశ్‌‌, రాధాకిషన్‌‌రావు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్‌‌లపై హైకోర్టు విచారించింది. 

పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్‌‌ పల్లె నాగేశ్వరరావు కేసు విచారణ వాయిదా కోరడంతో హరీశ్‌‌రావు తరఫు న్యాయవాది ఆర్‌‌.చంద్రశేఖర్‌‌ రెడ్డి, సీనియర్‌‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు అభ్యంతరం తెలిపారు. పీపీ అభ్యర్థన మేరకు విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేస్తూ.. అప్పటివరకు కేసు దర్యాప్తును నిలిపివేయాలంటూ దర్యాప్తు అధికారికి జడ్జి ఆదేశాలు జారీ చేశారు.