సీఎం, మంత్రుల ఐటీ చెల్లింపులపై..వివరణ ఇవ్వండి: హైకోర్టు

సీఎం, మంత్రుల ఐటీ చెల్లింపులపై..వివరణ ఇవ్వండి: హైకోర్టు
  •  రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు వచ్చే జీతాలపై ఆదాయపు పన్నును ప్రభుత్వమే చెల్లించడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇన్​కమ్ ట్యాక్స్ చెల్లింపు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు వేతనాలు, పెన్షన్, అనర్హతపై తొలగింపు చట్టం–1953లోని సెక్షన్‌‌‌‌ 3(4)ను సవాల్‌‌‌‌ చేస్తూ ఫోరం ఫర్‌‌‌‌ గుడ్‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌ తరఫున కార్యదర్శి ఎస్‌‌‌‌.శ్రీనివాస రెడ్డి హైకోర్టులో పిల్‌‌‌‌ వేశారు. 

దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ జె.అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌తో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌‌‌ తరఫు లాయర్‌‌‌‌ వాదిస్తూ.. ఇన్​కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ప్రజలు కూడా పన్ను చెల్లించాల్సి ఉందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో పాటు కేబినెట్ ర్యాంకు సలహాదారులు, చైర్​పర్సన్లు, పార్లమెంట్‌‌‌‌ కార్యదర్శుల పన్ను చెల్లించేలా ప్రభుత్వం సవరణలు తీసుకువచ్చిందన్నారు. 

సమాచార హక్కు చట్టం కింద పన్ను చెల్లింపు వివరాలను కోరినా వ్యక్తిగత గోప్యత కింద నిరాకరించారని వివరించారు.  ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సేవలకు వేతనాలు పొందే వారందరూ పన్ను చెల్లించాల్సిందేనని, ఇందులో వివక్ష ఉండరాదన్నారు. వాదనలను విన్న హైకోర్టు బెంచ్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ 
పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు ఇస్తూ విచారణ వాయిదా వేసింది.