- అక్కడి నిర్మాణాలపై సర్వే చేయాలి
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ కొత్తచెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలపై అందిన ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్కడ చేపట్టే నిర్మాణదారులకు నోటీసులు జారీ చేయాలని, సర్వేచేసి నిర్మాణాలు శిఖం భూమిలో ఉంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఖాజాగూడ సర్వే నంబర్ 5 లోని 525 ఎకరాల్లో కొత్తచెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే ఫిర్యాదుపై అధికారులు స్పందించలేదంటూ ఆర్ రామకృష్ణ, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి బుధవారం విచారించారు.
కొత్తచెరువు దక్షిణం వైపున జీహెచ్‌ఎంసీ పరిధిలోని నానక్‌రాం కుంట ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. తప్పుడు నివేదికను సమర్పించి భవన నిర్మాణానికి అక్రమంగా అనుమతులు పొందారని ఆయన పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తే చెరువు ఉనికి ఉండదన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. అక్రమ నిర్మాణాలపై అందిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీచేయాలని, అక్రమ నిర్మాణం తేలితే తొలగించాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చెరువులు, కుంటలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు వంటివి ఆక్రమించిన వాటిని క్రమబద్ధీకరించాలని ఎక్కడా లేదని చెప్పింది. ప్రతివాదులైన ఇరిగేషన్, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్, హెచ్‌ఎండీఏ. హైడ్రాలకు నోటీసులు ఇచ్చింది. సాహిని బిల్డర్స్ ఎల్‌ఎల్‌పీ బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ, కె.జ్ఞానేశ్వర్, దామర్ల రాఘవరావు, ఎం.భరతేందర్ రెడ్డిలకూ నోటీసులు ఇచ్చింది. విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.