ప్రశాంతి హిల్స్‌‌‌‌ భూములపై కౌంటరు దాఖలు చేయండి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌‌‌‌ నౌఖల్సా గ్రామానికి చెందిన సర్వే నెం.66/2లోని ప్రశాంతి హిల్స్‌‌‌‌లో నాగాహిల్స్‌‌‌‌ సొసైటీలోని ప్లాట్‌‌‌‌లకు కలెక్టర్‌‌‌‌ ఎన్వోసీ జారీ చేయడంపై హైకోర్టు నిలదీసింది. డిక్రీ పొందిన నాగా హిల్స్‌‌‌‌ దాని అమలుకు ప్రయత్నించాలిగానీ, ప్రైవేటు వ్యక్తికి ఎన్వోసీ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. ప్రశాంతి హిల్స్‌‌‌‌ భూములకు సంబంధించిన వివాదంపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.  

అప్పటివరకు ప్రశాంతిహిల్స్‌‌‌‌ భూములపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ విచారణను 28కి వాయిదా వేసింది. రాయదుర్గ్‌‌‌‌ నౌఖల్సాలోని సర్వే నెం. 66/2లోని ప్లాట్‌‌‌‌కు కలెక్టర్‌‌‌‌ ఎన్వోసీ జారీ చేయడంతో, నిర్మాణాలకు జీహెచ్‌‌‌‌ఎంసీ అనుమతులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఆళ్లగడ్డ చెన్నమ్మ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌‌‌‌పై జస్టిస్‌‌‌‌ సి.వి.భాస్కర్‌‌‌‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌ తరఫు లాయర్ ​వాదిస్తూ.. పిటిషనర్‌‌‌‌ 600 చదరపు గజాలను సాదాబైనామా కింద కొనుగోలు చేసి తర్వాత క్రమబద్ధీకరించుకున్నారని తెలిపారు. 

దీన్ని మొదట ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారని, తర్వాత నాగా హిల్స్‌‌‌‌ కోఆపరేటివ్‌‌‌‌ సొసైటీ కొనుగోలు చేసిందన్నారు. ప్లాట్‌‌‌‌లో నిర్మాణాలకు ప్రైవేటు వ్యక్తి మృత్యుంజయరెడ్డికి కలెక్టర్‌‌‌‌ ఎన్వోసీ జారీ చేశారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. భూమిపై సొసైటీ డిక్రీ పొందిందని, డిక్రీ అమలుకు సొసైటీ కోర్టును ఆశ్రయించాల్సి ఉందని, దీనికి భిన్నంగా కలెక్టర్‌‌‌‌ ఎన్వోసీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  భూమిపై యాజమాన్య హక్కులకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.