- 2022లో 177 పోస్టులకు ఎగ్జామ్ పెట్టిన సింగరేణి
- మాస్ కాపీయింగ్ జరిగిందంటూ కోర్టుకెళ్లిన పలువురు అభ్యర్థులు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్ సంస్థ 2022లో నిర్వహించిన జూనియర్అసిస్టెంట్ గ్రేడ్2 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల నిర్వహణ సరిగ్గా లేదని, మాస్కాపీయింగ్జరిగిందని పలువురు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో విచారణ జరిపిన కోర్టు సోమవారం తుది ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పరీక్షను రద్దు చేయడమా? తిరిగి నోటిఫికేషన్ఇవ్వడమా లేదంటే అప్పీల్‌కు వెళ్లడమా అనే విషయమై సింగరేణి యాజమాన్యం లీగల్అడ్వయిజర్లతో చర్చిస్తున్నట్టు తెలిసింది.
పరీక్ష రాసిన 77,907 మంది..
సింగరేణి యాజమాన్యం 2022 సంవత్సరంలో 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్2 పోస్టులకు నోటిఫికేషన్ఇష్యూ చేసింది. దీంతో 98,882 మంది దరఖాస్తు చేసుకోగా 90,928 మంది హాల్‌టికెట్లు డౌన్ లోడ్చేసుకున్నారు. 2022, సెప్టెంబర్4 న కొత్తగూడెంతో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లోని 187సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహించింది. 77,907 మంది పరీక్ష రాశారు.
నిర్వహణలో లోపాలంటూ హైకోర్టుకు
జూనియర్ అసిస్టెంట్పరీక్షను సరిగ్గా నిర్వహించలేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. క్వశ్చన్ పేపర్ ఇవ్వకపోవడం, కొన్ని ప్రశ్నపత్రాల బుక్లెట్స్ సీల్ వేసి ఉండకపోవడం, పలుచోట్ల అభ్యర్థులను సరిగ్గా తనిఖీ చేయకుండానే ఎగ్జామ్ హాల్లోకి పంపడం, మంచిర్యాల జిల్లాలో ఓ స్టడీ సెంటర్ నిర్వాహకులు పరీక్షకు ముందే క్వశ్చన్ పేపర్ సంపాదించారంటూ ఆరోపణలు వచ్చినట్టు అభ్యర్థుల తరఫు లాయర్ కోర్టులో వాదించారు. పరీక్ష జరిగిన తీరుపై తమకు అనుమానాలున్నాయని చెప్పారు. ఈ విషయంలో స్పందించిన సింగరేణి యాజమాన్యం పరీక్ష నిర్వహణను జేఎన్టీయూకు అప్పగించామని, ఇందులో తమ తప్పిదం లేదని అఫిడవిట్లో పేర్కొంది.
దీంతో తీర్పు వచ్చే వరకు ఫలితాలను హోల్డ్‌లో పెట్టాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ తర్వాత పరీక్ష నిర్వహణ సరిగ్గా జరగలేదని చెప్తూ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి పక్కాగా నిర్వహించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ విషయమై సింగరేణి డైరెక్టర్ బలరాం మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పుకు సంబంధించిన కాపీలు, పూర్తి వివరాలు తమకు అందాల్సి ఉందన్నారు. హైకోర్టు తీర్పుపై లీగల్అడ్వయిజర్లతో చర్చించి అప్పీల్‌కు వెళ్లే విషయం ఆలోచిస్తామన్నారు.