- రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల పరిష్కారం కోసం గతంలో తామిచ్చిన ఉత్తర్వులను సంబంధిత జిల్లా కోర్టులకు పంపాలంటూ రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిం ది. అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ కేసులో ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8లో పేర్కొన్న విధంగా గతేడాది నవంబర్ 9న సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై తీసుకున్న సుమోటో పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం మరోసారి విచారించింది.
ప్రస్తుతం కేసుల విచారణ తీరుపై హైకోర్టు రిజిస్ట్రీ సమర్పించిన నివేదికను పరిశీలించింది. తాజాగా రిజిస్టర్ అయిన 143 కేసులతో సహా పెండింగ్‌లో 258 కేసులున్నట్లు కోర్టు పేర్కొంది. 235 కేసుల్లో సమన్లు జారీ అయినట్లు తెలిపింది. రెండు కేసుల్లో మాత్రమే నిందితులను హాజరుపర్చినట్లు వెల్లడించింది. సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్న డిశ్చార్జి పిటిషన్లు పరిష్కారం కాలేదని వివరించింది. గతేడాది నవంబర్ నుంచి ఒక్క కేసులో కూడా తీర్పు వెలువడలేదని పేర్కొంది.
నివేదికను పరిశీలించిన ధర్మాసనం నేతలపై ఉన్న కేసుల పరిష్కారానికి గతంలో తామిచ్చిన ఆదేశాలను సంబంధిత కోర్టులకు పంపాలని ఆదేశిస్తూ విచారణను జూన్ 3కు వాయిదా వేసింది.