యూజీసీ, బీసీఐ గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారమే లా అడ్మిషన్లు..హైకోర్టు ఉత్తర్వులు జారీ 

  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ 

హైదరాబాద్, వెలుగు:  లా కోర్సుల అడ్మిషన్లు ప్రక్రియను యూనివర్సిటీ గ్రాంట్స్‌‌ కమిషన్‌‌(యూజీసీ), బార్‌‌ కౌన్సిల్‌‌ ఆఫ్‌‌ ఇండియా(బీసీఐ) గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారమే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌‌ క్యాలెండర్‌‌ మేరకు అడ్మిషన్లు చేసేందుకు వాదప్రతివాదులు అమోదించారు. దీంతో ఎల్‌‌ఎల్‌‌బీ, ఎల్‌‌ఎల్‌‌ఎం కోర్సుల్లో కౌన్సెలింగ్‌‌ ప్రక్రియను జూలైలోపు పూర్తి చేయకపోవడంతో క్లాసులు ప్రారంభించడం తీవ్ర జాప్యం అవుతోందంటూ హైదరాబాద్‌‌కు చెందిన న్యాయవాది ఎ. భాస్కర్‌‌రెడ్డి వేసిన పిల్‌‌పై హైకోర్టు విచారణ పూర్తయినట్లు ప్రకటించింది.

పిల్‌‌ను జస్టిస్‌‌ సుజోయ్‌‌పాల్, జస్టిస్‌‌ నామవరపు రాజేశ్వర్‌‌రావు డివిజన్‌‌ బెంచ్‌‌ గురువారం విచారించింది. పార్టీ ఇన్‌‌ పర్సన్‌‌గా పిటిషనర్‌‌ భాస్కర్‌‌రెడ్డి, ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌‌ఖాన్‌‌ వాదించారు. ఈ ఏడాదికి న్యాయ విద్య కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ ముగియడంతో వచ్చే సంవత్సరం నుంచి యూజీసీ, బీసీఐ మార్గదర్శకాలు పాటించాలనే వాదనలను ఇరుపక్షాలు ఆమోదించడంతో అందుకు అనుగుణంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.