- ప్రాజెక్టుపై విచారణ జరుగుతున్నందున ఉత్తర్వులు ఇవ్వలేం
- ప్రతివాదిగా రాష్ట్రం లేకుండా సీబీఐ విచారణ కోరుతారా?
- పిటిషనర్‌ను ప్రశ్నించిన కోర్టు
- అన్ని పిటిషన్లపై విచారణ 2 వారాలకు వాయిదా వేస్తున్నట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ విచారణతో పాటు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ ఎంక్వైరీ జరుగుతున్నదని తెలిపింది. ఈ టైమ్‌లో తాము కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అంశాలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ లాయర్ రామ్మోహన్ రెడ్డి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్, వ్యక్తిగత హోదాలో ప్రొఫెసర్ కోదండరామి రెడ్డి, ముధుగంటి విశ్వనాథ రెడ్డి, బక్క జడ్సన్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. రాష్ట్రం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పెంచిందన్నారు. ఈ పిటిషన్లలో ప్రతివాదిగా కేంద్రాన్ని, సీబీఐలనే చేశారని తెలిపారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ఉత్తర్వులు ఎలా ఇస్తామని ప్రశ్నించింది. లాయర్ రామ్మోహన్ రెడ్డి కల్పించుకుని.. తన పిటిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు అవ్వకముందే వేసిందని తెలిపారు. రాష్ట్రాన్ని కూడా ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతివ్వాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని విన్నవించారు.
ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను సింగిల్ బెంచ్ జడ్జి విచారిస్తున్నారని, ఆ కేసులో సీబీఐ కౌంటర్ వేసిందని తెలిపారు. సీబీఐ తరఫు అడ్వకేట్ శ్రీనివాస్ కపాటియా వాదిస్తూ.. కోర్టు ఏవిధమైన ఆదేశాలు జారీ చేసినా.. అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంపై విచారణ జరుగుతున్నదని, ఇప్పుడు తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. రాష్ట్రాన్ని ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
బక్క జడ్సన్ పిల్ వాపస్‌కు నిరాకరణ
కాళేశ్వరం పనులపై బక్క జడ్సన్ వేసిన పిల్‌ను వాపస్ తీసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతున్నందున పిల్‌ను వాపస్ తీసుకుంటామని బెంచ్‌ను కోరారు. పిటిషన్‌లోని విషయాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అందుకు అనుమతివ్వాలని కోరారు. దీనిపై హైకోర్టు బెంచ్ స్పందిస్తూ.. పిల్ వేశాక అది పూర్తిగా కోర్టు పరిధిలోని వ్యవహారం అవుతుందని, పిటిషనర్ పాత్ర పరిమితమని స్పష్టం చేసింది. పిల్ ఉప సంహరించుకోవాలంటే అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించింది. ఆ తర్వాతే ఆదేశాలిస్తామని చెప్పింది. జస్టిస్ ఘోష్ కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు పిటిషనర్‌కు అనుమతి ఇచ్చింది.