హైదరాబాద్, వెలుగు: పెండింగ్ క్రిమినల్ కేసులున్నాయన్న కారణంగా పాస్‌పోర్టు జారీకి నిరాకరించరాదని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లా కోర్టులో కేసు పెండింగ్ ఉందన్న కారణంగా తనకు పాస్‌పోర్టు జారీ చేయడానికి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఎన్.పూర్ణచందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ మౌసమీ భట్టాచార్య విచారించారు.
వెంగల కస్తూరి రంగాచార్యులు వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీం కోర్టు తీర్పులో పాస్ పోర్టు రెన్యూవల్, తిరిగి మంజూరు చేయడానికి పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసు కారణం కాదని స్పష్టం చేసిందని, దీని ఆధారంగా తాము గతంలో ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
కేసు విచారణకు సహకరిస్తానని, విచారణ పూర్తయ్యేదాకా అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లనంటూ పిటిషనర్ ఖమ్మం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించారు. ఈ అఫిడవిట్ సర్టిఫైడ్ కాపీని కోర్టు నుంచి తీసుకుని పాస్‌పోర్టుకు ఇతర పత్రాలతో సహా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. వీటిని పరిశీలించి పాస్‌పోర్టు జారీ చేయాలని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారికి ఆదేశాలు జారీచేశారు.