
హైదరాబాద్, వెలుగు:ఉస్మానియా ఆస్పత్రి తరలింపునకు సంబంధించిన వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో ఆస్పత్రి తరలింపును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించింది.
ఈ మేరకు పిటిషనర్ న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గౌలిగూడకు చెందిన ఆనంద్ గౌడ్ పిటిషన్ వేశారు.
దీన్ని జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారించారు. ఆస్పత్రిని తరలించాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని, తామ జోక్యానికి ఆస్కారం తక్కువన్నారు. ప్రభుత్వం కౌంటర్ వేయాలని ఆదేశించారు. విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు.