ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కరెక్టే : హైకోర్టు

  • రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యతిరేకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగితే కోర్టుకు రావొచ్చని హైకోర్టు తీర్పు
  • ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో భాగంగా లబ్ధిదారులను గుర్తించడానికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కరెక్టేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ పథకాల అమలు ప్రభుత్వ విచక్షణాధికారంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని వెల్లడించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వ జీవో 33 సబబేనని తీర్పులో పేర్కొంది. ఇందులో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఒకవేళ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగితే అప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. 

ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు కలెక్టర్లకు అధికారాలిస్తూ ప్రభుత్వం గత అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 11న జారీ చేసిన జీవో 33ను సవాలు చేస్తూ బీజెపీఎల్పీతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ఇటీవల తీర్చు చెప్పారు. తొలుత పిటిషనర్ల లాయర్లు వాదిస్తూ, గ్రామసభ వార్డు సమావేశాలతో సంబంధం లేకుండా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. గత కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వంలో డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండ్ల పథక లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేశారని వివరించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కూడా జరగాలన్నారు. 

అర్హులను గుర్తించేందుకే.. 

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి వాదిస్తూ.. అర్హులను గుర్తించడానికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలంటూ జిల్లా స్థాయిలో కలెక్టర్లు, జీహెచ్ఎంసీ స్థాయిలో కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో 33 జారీ అయిందన్నారు. లబ్ధిదారుల తుది జాబితా తయారీలో ఇందిరమ్మ కమిటీల పాత్ర అంతిమం కాదని, జాబితా సిద్ధం చేశాక గ్రామ, వార్డు సభలు నిర్వహించి అర్హుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. దీనివల్ల పిటిషనర్లకు ఎలాంటి రాజ్యాంగ చట్టబద్ధ హక్కులకు భంగం వాటిల్లదని ఆయన వెల్లడించారు.

 ఇరు వాదనలను విన్న న్యాయమూర్తి.. లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీల నిర్ణయం అంతిమం కాదన్నారు. ప్రజావాణి కింద కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందిన దరఖాస్తులపై గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్నిపాలిటీల్లో వార్డు స్థాయి అధికారి సర్వే నిర్వహిస్తారని చెప్పారు. గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేయడానికి మాత్రమే ఇందిరమ్మ కమిటీలు సాయం చేస్తాయని పేర్కొన్నారు. లబ్ధిదారుల అర్హతలను నిర్ణయించడానికి గ్రామసభలకు చట్టం అధికారం కల్పించదని పేర్కొన్నారు. 

పథకాల అమలు ప్రభుత్వ విచక్షణాధికారంపై ఉంటుందని విధాన నిర్ణయాల్లో న్యాయసమీక్ష పరిధి తక్కువని అని పేర్కొన్నారు. ప్రస్తుత కేసులో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండటానికి ఈ విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అందువల్ల ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో జోక్యం చేసుకోలేమని న్యాయయూర్తి వెల్లడించారు. ఒక లక్ష్యానికి విరుద్ధంగా అనర్హులను ఎంపిక చేసినట్లు తేలితే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంటూ విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.