పోలీసుల సోదాల నిలిపివేతపై స్టేకు హైకోర్టు నిరాకరణ

పోలీసుల సోదాల నిలిపివేతపై స్టేకు హైకోర్టు నిరాకరణ
  • వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు 

హైదరాబాద్, వెలుగు: మిషన్‌‌ ఛబుత్రా, ఆపరేషన్‌‌ రోమియో తదితర పేర్లతో పోలీసులు నిర్వహిస్తున్న సోదాల నిలిపివేతకు స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మిషన్‌‌ ఛబుత్రా, ఆపరేషన్‌‌ రోమియో, మిడ్‌‌నైట్‌‌ కౌన్సెలింగ్‌‌ వంటి పేర్లతో చట్టవిరుద్ధంగా సోదాలు నిర్వహించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌‌ బషరత్‌‌ నగర్‌‌కు చెందిన సామాజిక కార్యకర్త ఎస్‌‌క్యూ మసూద్‌‌ పిల్‌‌ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.శ్రీనివాసరావుతో కూడిన బెంచ్​ బుధవారం విచారణ చేపట్టింది. 

పిటిషనర్‌‌ తరఫున అడ్వొకేట్ వాదనలు వినిపిస్తూ.. చిన్న చిన్న వ్యాపారులు, ఫుట్‌‌పాత్‌‌ వ్యాపారులను రాత్రి 10.30 నుంచి 11 గంటల్లోపే మూసివేయిస్తున్నారని, ఇది 2015లో జారీ చేసిన జీవో 15కు విరుద్ధమన్నారు. హోటళ్లు, రెస్టారెంట్‌‌లను ఉదయం 5 నుంచి రాత్రి 12 గంటలకు వరకు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతించినా పోలీసులు వేధిస్తున్నారని పేర్కొన్నారు. 

పేదలు నివసించే కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే సోదాలు నిర్వహిస్తున్నారని.. ఈ సోదాలను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఇందులో పిటిషనర్‌‌ ఉన్న కాలనీలోనూ సోదాలు నిర్వహించారని, అందులో పిటిషన్‌‌ ఇంటిని సోదా చేశారన్నారు. ఇందులో తానూ బాధితుడేనని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న బెంచ్ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నగర పోలీసు కమిషనర్లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.