- జీవో జారీలో చట్టబద్ధత లోపించింది: హైకోర్టు
- ఆందోళనకరంగా హైడ్రా పనితీరు..నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలా అని ప్రశ్న
- రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు.. కౌంటర్‌కు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైడ్రా ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర సర్కారు జారీ చేసిన జీవో 99 అమలును నిలిపివేస్తూ స్టే ఇవ్వలేమని హైకోర్టు పేర్కొన్నది. ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. జీహెచ్ఎంసీ యాక్ట్మేరకు హైడ్రాకు అధికారాలను ఎలా ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
హైడ్రా ఏర్పాటు, విధులు, బాధ్యతలు, చట్టబద్ధతపై సమగ్ర వివరాలు అందజేయాలని ఆదేశించింది. జీవో 99 చట్టబద్ధతను సవాలు చేస్తూ హైదరాబాద్ నానక్‌రాంగూడకు చెందిన డి.లక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..చట్టాలకు విరుద్ధంగా ఇచ్చే పరిపాలనాపరమైన అధికారాలు చెల్లవన్నారు. జీవో 99 ద్వారా జీహెచ్‌ఎంసీ అధికారాలను హైడ్రాకు అప్పగించిందని, ఇది జీహెచ్‌ఎంసీ చట్టానికి విరుద్ధమన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారాల కింద హైడ్రా పనిచేయడం చెల్లదని చెప్పారు.
అఖిల భారత సర్వీసు ఉద్యోగి, కార్యదర్శి హోదాకంటే తక్కువ కాని అధికారి హైడ్రాకు నేతృత్వం వహిస్తారని జీవోలో పేర్కొన్నప్పటికీ దానికి విరుద్ధంగా నాన్ ఐఏఎస్ అధికారి నేతృత్వం వహిస్తున్నారన్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో సర్వే నెం.119/21, 1199/22లో పిటిషనర్‌కు చెందిన 19.27 ఎకరాల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. వ్యవసాయ పరికరాలు, కూలీల విశ్రాంతి కోసం నిర్మించుకున్న నిర్మాణాలను ఈనెల 3న హైడ్రా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేసిందన్నారు.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నప్పటికీ పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టిందని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి .. చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని హైడ్రాను ప్రశ్నించారు.
హైడ్రా పనితీరు ఆందోళనకరంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. ఇతర శాఖలు అనుమతులు మంజూరు చేసిన తర్వాత ఎలాంటి వివరణ కోరకుండా, నోటీసులు ఇవ్వకుండా ఏ అధికారంతో కూల్చివేస్తారని అడిగారు. హైడ్రాను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 99ను చట్టబద్ధత లోపించిందని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. విచారణను వచ్చే నెల మొదటివారానికి వాయిదా వేశారు.
చట్టవిరుద్ధంగా కూల్చివేశారంటూ పిటిషన్
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మకు చెందిన 9 ఎకరాల వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్‌ను, కాంపౌండ్‌ను కూల్చివేయడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
1970 నాటి అమీన్‌పూర్ చెరువు మ్యాప్‌ను సమర్పించాలని, అంతేగాకుండా నోటీసు ఇవ్వకుండా చేపట్టిన కూల్చివేతలపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ పురపాలకశాఖ, నీటిపారుల శాఖల ముఖ్యకార్యదర్శులు, జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.
తమ వ్యవసాయ భూమిలో నిర్మించుకున్న షెడ్‌లను, కాంపౌండ్‌ను హైడ్రా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఉమామహేశ్వరమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.వినోద్‌కుమార్ శుక్రవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..పట్టా భూమిలో ఉన్న కాంపౌండ్, షెడ్‌లను ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందంటూ సెప్టెంబరు 8న హైడ్రా అధికారులు కూల్చివేశారని కోర్టుకు తెలిపారు.
ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదంటూ గతంలో ఇరిగేషన్ అధికారులు నివేదిక ఇచ్చారని వెల్లడించారు. 900 మామిడి, 5000 జామ, 200 దానిమ్మతోపాటు పైనాపిల్, సీతాఫలం వంటి మొక్కలను పెంచుతున్నామని వివరించారు.
వీటి రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన కాంపౌండ్‌ను కూల్చివేశారని, పునర్నిర్మించుకోవడానికి అనుమతించాలని కోరారు. దీనికి న్యాయమూర్తి నిరాకరిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేశారు.