సూరి హత్య కేసులో భానుకు జీవితఖైదు కరెక్టే: హైకోర్టు

సూరి హత్య కేసులో భానుకు జీవితఖైదు కరెక్టే: హైకోర్టు
  • కింది కోర్టు తీర్పులో జోక్యానికి హైకోర్టు నిరాకరణ

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం రేపిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో నిందితుడు మలిశెట్టి భానుకిరణ్‌‌కు నాంపల్లి కోర్టు విధించిన యావజ్జీవ శిక్ష తీర్పును హైకోర్టు సమర్థించింది. నాంపల్లి కోర్టు తీర్పును సవాల్‌‌  చేస్తూ భాను వేసిన పిటిషన్‌‌ను కొట్టివేస్తూ గురువారం జడ్జీలు జస్టిస్‌‌  కె.లక్ష్మణ్, జస్టిస్‌‌  పి.శ్రీసుధతో కూడిన బెంచ్  ధర్మాసనం తీర్పు చెప్పింది.

టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులో సూరి ప్రధాన నిందితుడు. 2011 జనవరిలో సూరిని హైదరాబాద్‌‌లోని సనత్​నగర్‌‌లో భానుకిరణ్‌‌ కాల్చి చంపినట్లు ఆరోప ణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో నాంపల్లి కోర్టు 2018లో అతనికి యావజ్జీవ శిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధించింది. భాను ఒక పథకం ప్రకారం సూరిని హత్య చేశాడని, ఒకే కారులో సూరితో కలిసి భాను మాత్రమే ప్రయాణించాడని, కుట్రలో భాగంగానే సూరిని హత్య చేశారని పబ్లిక్‌‌  ప్రాసిక్యూటర్‌‌  నాగే శ్వర్‌‌ రావు వాదించారు.

అయితే, స్పీడ్‌‌ బ్రేకర్‌‌  వద్ద కారు వేగం తగ్గించిన సమయంలో బయటి నుంచి మరొకరు కాల్పులు చేయడం వల్ల సూరి చనిపోయాడని భాను తరపు అడ్వొకేట్ పేర్కొన్నారు. ఇరు పక్షాలు వాదనలు విన్న హైకోర్టు.. కింది కోర్టు తీర్పును ఆమోదిస్తూ తీర్పు చెప్పింది.