కిషన్ బాగ్ దేవాలయ భూవివాదం..హైకోర్టు కీలక ఆదేశం

కిషన్ బాగ్ దేవాలయ భూవివాదం..హైకోర్టు కీలక ఆదేశం
  • ఆ స్థలాన్ని ఖాళీ చేయాల్సిందే..హైకోర్టు ఆదేశం 
  • కిషన్ బాగ్ మురళీమనోహర్ స్వామి ఆలయ భూవివాదంపై హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సిటీలోని కిషన్ బాగ్ మురళీమనోహర్ స్వామి ఆలయానికి చెందిన 3,500 చదరపు గజాల స్థలాన్ని ఖాళీ చేయాలంటూ దేవాదాయ శాఖ ఇచ్చిన నోటీసులను హైకోర్టు సమర్థించింది. లీజు పొడిగింపు లేకపోయినా దేవాదాయ శాఖ ఎలాంటి చర్యలు  తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. లీజులో జోక్యం చేసుకోరాదంటూ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. 

బహదూర్ పురా నియోజకవర్గం కిషన్​బాగ్​లోని మురళీ మనోహర్ స్వామి ఆలయానికి చెందిన 3,500 చదరపు గజాల స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఆలయ ఎగ్జిక్యూటివ్  అధికారి 2021 ఫిబ్రవరిలో ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ బ్రిజ్ గోపాల్ హెడా అనే వ్యాపారి హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్  నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్  తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 1980లో తన క్లైంటు తండ్రి ఆలయ భూమిని అద్దెకు తీసుకున్నారని, ఆయన తండ్రి 2020లో మరణించగా అక్కడే వ్యాపారం కొనసాగిస్తున్నారని చెప్పారు.

దేవాదాయ శాఖ తరపు న్యాయవాది మంగీలాల్ నాయక్ ప్రతివాదనలు వినిపిస్తూ ఆలయ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన రాజ్ కుమార్  రత్లోల్ నుంచి 2010లో ఆలయ పరిపాలన విభాగాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుందన్నారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ పేరిట ఎలాంటి లీజు లేదన్నారు. ఆలయ భూమిని ఖాళీ చేయాలని ఆదేశిస్తూ పిటిషన్ ను కొట్టివేశారు.

ప్రభుత్వ భూమి కబ్జాపై విచారణ జరిపించండి

కొంపల్లి సర్వే నం.105లోని ప్రభుత్వ భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కొంపల్లి మున్సిపాలిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. కొంపల్లి మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారులు సర్వే నిర్వహించాలని, రోడ్డు భూమిలోని ఆక్రమణలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌‌ను జడ్జి బి.విజయసేన్ రెడ్డి శుక్రవారం విచారించారు. 

మెస్సర్స్​కాసా గ్రాండ్ హైదర్‌‌ వైజ్ కంపెనీ 40 రోడ్డును ఆక్రమించి, గేటు, షీట్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేసిందని పిటిషనర్ న్యాయవాది వాదించారు. రోడ్డుకు సంబంధించిన గూగుల్ మ్యాప్స్ ఫొటోలను సమర్పించారు. రియల్ ఎస్టేట్ సంస్థ తరపు న్యాయవాది వాదిస్తూ తన క్లైంట్​ఎటువంటి భూమిని లేదా రహదారిని ఆక్రమించి లేదన్నారు. విలేజ్ మ్యాప్ ఇతర రికార్డులకు కట్టుబడి ఉన్నారని వాదించారు. పిటిషనర్ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు స్థలాన్ని పరిశీలించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.