మేడిగడ్డ వ్యవహారంలో స్టే పొడిగింపు

మేడిగడ్డ వ్యవహారంలో  స్టే పొడిగింపు
  • కేటీఆర్‌‌ పిటిషన్‌‌పై  హైకోర్టు విచారణ 12కు వాయిదా

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సందర్భంగా అనుమతుల్లేకుండా డ్రోన్‌‌ వినియోగించారంటూ బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌‌‌, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్‌‌పై పోలీసులు నమోదు చేసిన కేసు విచారణను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఇందులో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన పోలీసులు, ఫిర్యాదుదారు అయిన నీటి పారుదల శాఖ సహాయ ఎగ్జిక్యూటివ్‌‌ ఇంజినీర్‌‌‌‌ వలి షేక్‌‌ను ఆదేశించింది. మేడిగడ్డ సందర్శన వ్యవహారంపై పోలీసులు గతేడాది జులై 29న మహదేవపూర్‌‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్, గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్‌‌ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలను గురువారం న్యాయమూర్తి జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ మరోసారి విచారణ చేపట్టి, కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణను 12కు వాయిదా వేశారు.

 గత విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మేడిగడ్డలో నీరు ఉన్నా.. విడుదల చేయకపోవడంతో పిటిషనర్లు బ్యారేజీని సందర్శించారన్నారు. దీనివల్ల ఖరీఫ్‌‌ రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ గేట్లు ఎత్తి నీటి వదలలేదన్న విషయంపై వీడియోని చిత్రీకరిస్తుంటే నీటి పారుదల శాఖ అధికారులు దురుద్దేశంతో ఫిర్యాదు చేశారని మండిపడ్డారు.