- తేల్చి చెప్పిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు : అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసే హక్కు సబ్ రిజిస్ట్రార్‌కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మంచిర్యాల జిల్లా, కాశిపేట మండలానికి చెందిన పెద్దనపల్లి సర్వే నెం.5/33లోని తమ 8 ఎకరాల అసైన్డ్ భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడాన్ని సవాలు చేస్తూ ఎస్.పద్మ అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషిన్నై ఇటీవల జస్టిస్ సీవీ.భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ప్రస్తుతం ఈ భూమి ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో ఉందని కోర్టుకు తెలిపారు.
2013నాటి తహసీల్దార్ ఉత్తర్వులకు విరుద్ధంగా సబ్‌రిజిస్ట్రార్ భూమి విక్రయ దస్తావేజులను అనుమతించారని చెప్పారు. అసైన్డ్ చట్టం ప్రకారం.. అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసిన సబ్‌రిజిస్ట్రార్‌లు 6 నెలల శిక్షార్హులని గుర్తుచేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసే హక్కు సబ్‌రిజిస్ట్రార్‌కు లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. విచారణను నవంబరు 22వ తేదీకి వాయిదా వేశారు.