హైదరాబాద్, వెలుగు : దత్తత ఇచ్చిన బాలికను శిశు సంక్షేమ కమిటీ తీసుకువెళ్లడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. చట్టవిరుద్ధంగా తీసుకెళ్లడం చెల్లదని పేర్కొంది. బాలికను దత్తత తీసుకున్న వారికి అప్పగించాలని కమిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చింది. బాలికను తక్షణం తండ్రికి అప్పగించాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తన రెండున్నరేండ్ల దత్త పుత్రికను బలవంతంగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు తీసుకువెళ్లారంటూ మలక్‌పేటకు చెందిన అరుణ్ కుమార్ గుప్త, బాలిక తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌లను జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
2021 జులై 27న చట్టప్రకారం అరుణ్‌కుమార్ బాలికను దత్తత తీసుకోగా.. కొద్ది రోజుల తర్వాత శిశు సంక్షేమశాఖకు అధికారులు ఇంట్లోకి చొరబడి బాలికను తీసుకువెళ్లిపోయారని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. తిరిగి బాలికను అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, పరిహారంగా రూ.10 లక్షలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ వద్ద అనధికారికంగా బాలిక ఉందన్న ఫిర్యాదు మేరకు అధికారులు బాలికను ఆధీనంలోకి తీసుకున్నారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. వాదనలు విన్న హైకోర్టు నిబంధనల ప్రకారం సంరక్షుకులు అసమర్థులని భావించినప్పుడు మాత్రమే బాలికను వారి సంరక్షణలోకి తీసుకోవచ్చునని, అయితే అసమర్థులని నిరూపించే ఆధారాలు లేవని చెప్పింది. అధికారుల నుంచి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలనే వ్యవహారంలోకి తాము వెళ్లడం లేదని, బాలిక స్వేచ్ఛ వరకే పరిమితమైనట్లు ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.