- ఇట్లయితే వరంగల్ లెక్కనే వరదలొస్తయ్
హైదరాబాద్, వెలుగు: చెరువుల ఆక్రమణలను అడ్డుకోకపోతే ఇతర ప్రాంతాల్లోనూ వరంగల్‌లో తరహా వరదలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. చెరువుల గట్టు, బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ లను కాపాడే విషయంలో కఠినంగా ఉండకుంటే భావి తరాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి వనరులు, సహజ వనరుల రక్షణకు చర్యలు చేపట్టకపోతే ప్రకృతే వికృత రూపం దాలుస్తుందని తీవ్ర హెచ్చరిక చేసింది. ఆక్రమణల వల్లే వరంగల్ ముంపుకు గురైందని గుర్తు చేసింది. నిర్మల్‌లో చెరువుల ఆక్రమణలపై చర్యలు కాగితాలకే పరిమితం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌కు స్పష్టం చేసింది. ఆచరణలో అమలు కనబడాలని తేల్చి చెప్పింది. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ ఏరియాలు రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రిజిస్ట్రేషన్ల నిషేధిత లిస్టులో ప్రైవేట్ భూములే కనిపిస్తాయి తప్ప ప్రభుత్వ భూములుండనే ఉండవని వ్యాఖ్యానించింది. వాటిని కూడా లిస్ట్‌లో చేర్చాలంది. నిర్మల్‌లో జాఫర్ చెరువు, కుర్రాన్‌పేట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవడం లేదంటూ కె.అంబుకుమార్‌రెడ్డి వేసిన పిల్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. నిర్మల్ కలెక్టర్ హాజరై ఆక్రమణల తొలగింపుచర్యలపై వివరించారు. నిర్మల్‌లో 11 చెరువుల్లో ఎనిమిది ఆక్రమణలకు గురైతే తొలగింపు చర్యలు తీసుకుంటున్నాం. జంతు వధశాల, కమ్యూనిటీ హాల్స్ తొలగించాం. గుడుల తొలగింపుకు స్థానికుల మద్దతు కావాలి. ఎఫ్‌టీఎల్ పరిధిలో రూ.30 కోట్ల విలువైన ఆక్రమణలను తొలగించాం” అని చెప్పారు. ఆ చర్యలను నివేదించేందుకు సమయం కావాలని ప్రభుత్వ లాయర్ రాధీవ్‌రెడ్డి కోరారు. ఆక్రమణల తొలగింపుపై అఫిడవిట్ దాఖలు చేయాలని కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేసింది.