హైదరాబాద్, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట గ్రామంలో కూల్చేసిన పేదల ఇండ్లను మళ్లీ నిర్మించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పేదలు ఇండ్లు కూల్చినంత సులభంగా ధనవంతుల అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ధైర్యముందా అని నిలదీసింది. కోర్టు ఉత్తర్వులున్నా పట్టించుకోకుండా పేదల ఇండ్లు కూల్చివేసినందున.. సొంత ఖర్చులతో మళ్లీ ఆ ఇండ్లను కట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించింది. దోమలపెంటకు చెందిన కటకం మహేశ్ ఇల్లు అక్రమ నిర్మాణమంటూ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేయగా.. వారు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారించిన హైకోర్టు నిర్మాణాల కూల్చివేతను చేపట్టరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే.. ఈ ఉత్తర్వులుండగానే అధికారులు ఇంటిని కూల్చివేయడంతో మహేశ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి మంగళవారం విచారించారు. అదనపు అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ.. ఇది జిల్లా పంచాయతీ అధికారికి తెలియకుండా జరిగిందన్నారు. కూల్చివేసిన నిర్మాణాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిర్మాణాన్ని పునరుద్ధరించాలని, అంతేగాకుండా పరిహారం, శిక్ష గురించి కూడా తరువాత పరిశీలిస్తామంటూ విచారణను వాయిదా వేశారు.