- తీర్మానాలు, పాలనపై ఖాకీల నిఘా
- పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరిక
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు ఊళ్లలో అరాచకాలకు పాల్పడుతున్నాయి. ఆర్మూర్, నిజామాబాద్ డివిజన్లలో వీడీసీల ఆగడాలు ఎక్కువయ్యాయి. వారి తీర్మా నాలు అమలు చేయకపోతే బాధితులు గ్రామ బహిష్కరణలకు వెనుకాడడం లేదు. అయితే ఇటీవల జరిగిన పలు ఘటనలపై హైకోర్టు సీరియస్ కావడంతో ఇప్పటికైనా వారి తీరు మారుతుందా? అనే చర్చ కొనసాగుతోంది.
పెత్తనం అంతా వారిదే..
జిల్లావ్యాప్తంగా సుమారు 154 గ్రామాభివృద్ధి కమిటీలు ఉన్నాయి. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని కమిటీలు గ్రామ పాలనను శాసిస్తున్నాయి. వారి తీర్మానాలు అమలు చేయకుంటే కఠినమైన శిక్షలు విధిస్తున్నారు. సర్పంచ్ , ఎంపీటీసీ, ఎంపీపీలు ఉన్నా గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయాలే అమలు చేయాల్సి వస్తోంది. బహిష్కరణకు గురైన వారికి సహకరిస్తే భారీ జరిమానాలను విధిస్తున్నారు. కొందరు ఈ కమిటీలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదు. తమ గ్రామ సమస్యను తామే పెద్దలతో సమావేశమై పరిష్కరిస్తామని కొందరు ప్రజాప్రతినిధులు పోలీసులపై ఒత్తిడి తేవడంతో వారు కూడా మౌనంగా ఉంటున్నారు. పెళ్లిళ్లు, భూతగాదాలు, ఇరువర్గాల మధ్య వివాదాలు, ఆస్తి పంపకాలు ఇలా అన్ని విషయాల్లో వీడీసీ పంచాయితీలు నిర్వహిస్తూ పెత్తనం చెలాయిస్తున్నాయి.
లీడర్లకు తప్పని సెగ..
జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల నిర్ణయాలతో ప్రజాప్రతినిధులకు సెగ తగులుతోంది. 2001లో పెర్కిట్ గ్రామాభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడని అప్పటి ఆర్యూర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఆ గ్రామాభివృద్ధి కమిటీ బహిష్కరించింది. ఎమ్మెల్యే కార్యక్రమాల్లో పాల్గొనరాదని చాటింపు వేయించారు. అయితే రాజకీయ కోణంలో ఈ నిర్ణయం జరిగిందని చర్చలతో సమస్యను పరిష్కరించారు. 2018లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి వీడీసీ నిరసన తగిలింది. మాక్లూర్ మండల కేంద్రంలో అభివృద్ధి జరగలేదని గ్రామానికి రావద్దంటూ కమిటీ పేరిట బ్యానర్లు కట్టారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా అధిక సంఖ్యలో వీడీసీల నియంతృత్వ నిర్ణయాలకు బాధితులే. అభివృద్ధి పనుల విషయంలో అవినీతికి తావు లేకుండా సమగ్రాభివృద్ధికి వీడీసీల భాగసామ్యం ఉన్నప్పటికీ నియంత ధోరణితో పెద్దలు బజారున పడుతున్నారు.
డిసెంబర్ 28న నందిపేట మండలంలో షాపూర్‌లో స్థల వివాదం వల్ల 80 కుటుంబాలను వీడీసీ సాంఘిక బహిష్కరణ చేసింది. ఎనుగంటి సుజాత మహిళ ఇంటి స్థల వివాదం నేపథ్యంలో ఈ కుటుంబాలకు గ్రామ బహిష్కరణ విధించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసుల జోక్యం చేసుకున్నారు. హైకోర్టు సీరియస్‌కావడంతో రెవెన్యూ ఆఫీసర్లు వివాద స్థలాన్ని సందర్శించారు. ఆఫీసర్ల జోక్యంతో ప్రస్తుతానికి ఈ గొడవ సద్దుమణిగింది.
ధర్పల్లి మండలంలో డిసెంబర్ 25న ఇద్దరు రైతుల కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. వీరు 4 ఎకరాల్లో 1,600 ఈత చెట్ల పెంచారు. అయితే ఈ చెట్లను గౌడ సంఘానికి అప్పగించాలని సంఘం ప్రతినిధులు కోరగా వారు నిరాకరించారు. దీంతో కుల బహిష్కరణ చేశారు. పోలీసుల జోక్యంతో ఈ వివాదానికి తెరపడింది.
న్యాయం చేయాలి
మా స్థలాన్ని కొందరు వీడీసీ సభ్యులు కావాలని వివాదం చేశారు. మాకు మద్దతు ఇచ్చిన కుటుంబాలను బహిష్కరించి మానసికంగా వేధిస్తున్నారు. రెవెన్యూ ఆఫీసర్లు స్పందించి మాకు న్యాయం చేయాలి.
- సుజాత, బాధితురాలు, షాపూర్
చర్యలు తీసుకుంటాం...
వీడీసీలు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తే ఊరుకోం. కొన్ని చోట్ల గ్రామ బహిష్కరణ ఘటనలు మా దృష్టికి వచ్చాయి. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తాం.
- ఎ.వెంకటేశ్వర్లు, ఏసీపీ నిజామాబాద్