‘దివ్యాంగ’ కమిషనర్ నియామకం ఎప్పుడు?..ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు

‘దివ్యాంగ’ కమిషనర్ నియామకం ఎప్పుడు?..ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : దివ్యాంగుల చట్టం కింద ప్రత్యేక కమిషనర్‌‌ నియామకం చేపట్టకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దివ్యాంగుల హక్కుల చట్టం సెక్షన్‌‌ 79(1) కింద ప్రత్యేక కమిషనర్‌‌ ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఆలిండియా కాన్ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ది బ్లైండ్‌‌తోపాటు మరో సంస్థ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేసింది. దీన్ని జస్టిస్‌‌ సూరేపల్లి నంద సోమవారం విచారించారు.

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది సాహితి శ్రీకావ్య వాదిస్తూ..దివ్యాంగుల హక్కుల చట్టం కింద ప్రత్యేక కమిషనర్‌‌ లేకపోవడంతో సీనియర్‌‌ సిటిజన్‌‌ సంక్షేమ డైరెక్టర్‌‌కే బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. రెండు శాఖలకు చెందిన సంక్షేమ పథకాలను పర్యవేక్షణ ఉండటంలేదని, పథకం అమలు చేసే అధికారే పర్యవేక్షణాధికారిగా ఉండటం వల్ల ఫిర్యాదులు ఇవ్వడం కూడా సాధ్యం కాదన్నారు. దివ్యాంగుల హక్కుల రక్షణకు స్వతంత్ర రాష్ట్ర కమిషనర్‌‌ను నియమించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను వాయిదా వేశారు.