- భూసేకరణ ప్రక్రియ జరుపుకోవచ్చు
- ట్రిపుల్ ఆర్ భూసేకరణపై ఎన్హెచ్ఏఐకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్(టిపుల్ ఆర్) ఉత్తర దిశ నిర్మాణంలో భూమి కోల్పోతున్న ఇద్దరు రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇద్దరు పిటిషనర్లను వాళ్ల భూముల నుంచి ఖాళీ చేయించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్‌ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)కు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు భూసేకరణ ప్రక్రియకు అడ్డంకి కాబోవని, భూసేకరణ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.
ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పాములపర్తిలో సర్వే నంబర్‌లో 263లో 14 ఎకరాల భూ యజమాని కట్ట ఆరులప్ప, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామం సర్వే నంబర్ 375, 377, 336లోని 9.03 ఎకరాల భూమి మొత్తం పోతోందని శ్రీరాంరెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లను జస్టిస్ కాజా శరత్ ఇటీవల విచారణ జరిపి పైవిధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్‌హెచ్ 44, ఆర్‌ఆర్‌ఆర్ ఇంటర్ జంక్షన్‌ను దాదాపు 60 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. దీని కోసం 2022, మే 25న 3ఏ నోటిఫికేషన్.. 2023, ఆగస్టు 8న 3డీ ఎన్‌హెచ్‌ఏఐ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్లను రైతులిద్దరు సవాల్ చేశారు. దాదాపు 4,704.25 ఎకరాల్లో ఎన్‌హెచ్‌ఏఐ ట్రిపుల్ ఆర్ నిర్మాణం చేపట్టనుంది. ఇందులో దాదాపు 4,315.33 ఎకరాలు ప్రైవేటు భూమిని సేకరిస్తున్నారు. అంటే మొత్తం భూ సేకరణలో ప్రైవేటు భూమి వాటా 91.73 శాతం.. ప్రభుత్వ భూమి5 శాతం.. అటవీ భూమి 3.27 శాతమని తెలిపారు. ప్రై వేట్ భూమి శాతాన్ని తగ్గించే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం ఆ మార్గాలపై దృష్టి సారించలేదని వివరించారు.
పిటిషనర్ల తరఫున న్యాయవాది గౌరారం రాజశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించారు. జాతీయ రహదారుల చట్టాన్ని పాటించడంలో పలు వ్యత్యాసాలు ఉన్నందున 3ఏ, 3డీ నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని కోరారు. భూమి కోల్పోతున్న వారిని గుర్తించాలని, 3డీ నోటిఫికేషన్ కంటే ముందే రిహ్యాబిటేషన్ అండ్ రిసెటిల్‌మెంట్(ఆర్‌ఆర్) ప్యాకేజీ అమలు చేయాల్సి ఉందన్నారు. రోడ్డు ప్రాజెక్టులకు భూసేకరణ ఉపశమనం, పునరావాస చట్టం 2013 అమలు కాదని, ఆర్‌ఆర్ ప్యాకేజీ ముందే అమలు చేయాల్సిన అవసరం లేదని ఎన్‌హెచ్‌ఏఐ న్యాయవాది వాదించారు. వాదనల తర్వాత హైకోర్టు, కేంద్ర రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి, ఎన్‌హెచ్‌ఏఐ తదితరులకు నోటీసులు జారీ చేసింది. వీరంతా తదుపరి విచారణ జరిగే జూన్ 14లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
హాస్టల్స్‌లో వసతులు కల్పించండి
రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల్లో వేసవి సెలవులు పూర్తి అయ్యేలోగా మౌలిక వసతులను కల్పించి జూన్ 10న జరిగే విచారణ నాటికి ఉత్తర్వుల అమలు నివేదికను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడటమే కాకుండా అనార్యోగానికి గురవుతున్నారంటూ కె.అఖిల్ శ్రీగురుతేజ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
రాష్ట్రంలో 2800 వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో లక్షల సంఖ్యలో స్టూడెంట్స్ ఉన్నారని అడ్వొకేట్ చిక్కుడు ప్రభాకర్ చెప్పారు. సుమారు 52 వేల మరుగుదొడ్లు. 30 వేలకుపైగా బాత్ రూమ్స్ అవసరం ఉందన్నారు. జాతీయ కమిషన్–2018 నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు సౌలత్లు అందించడం లేదని, 10 మందికి ఒక బాత్రూమ్, ఏడుగురికి ఒక మరుగుదొడ్డి, 50 మందికో వార్డెన్ ఉండాలన్న నిబందన అమలు కావడం లేదన్నారు. ఇటీవల సుమారు వంద మంది విద్యార్థులు ఆనారోగ్యానికి గురయ్యారని, వారిలో ముగ్గురు స్టూడెండ్స్ మరణించారని చెప్పారు.
వసతులు లేకపోవడంతో చాలామంది స్టూడెంట్స్ సరిగ్గా చదవలేకపోతున్నారని తెలిపారు. మౌలిక వసతుల సమస్య ఉన్న మాట వాస్తవమేనని, ఇప్పుడు వేసవి సెలవుల కారణంగా విద్యార్థులు ఉండరని, పనులు చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. జూన్ 10లోగా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.