మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయిగణేశ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అతని ఆత్మహత్యకు సంబంధించి హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. పోలీసుల వేధింపులు తాళలేక సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని కోరారు. అయితే సాయి గణేశ్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని కోర్టు దృష్టికి తెచ్చారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాల తో కౌంటర్ ధాఖలు చేస్తామని ఏజీ ధర్మాసనానికి విన్నవించారు. దీంతో న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

ఈ నెల 14న ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు సాయి గణేశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బీజేపీ కార్యకర్తలు వెంటనే ఆయనను హాస్పిటల్ లో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరణానికి ముందు మీడియాతో మాట్లాడిన సాయి గణేశ్ తనను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులకు గురి చేసినట్లు చెప్పారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు తనపై 16 కేసులు పెట్టడంతో పాటు రౌడీ షీట్ ఓపెన్ చేశారని చెప్పాడు.