హైడ్రా కమిషనర్​కు హైకోర్టు నోటీసులు

హైడ్రా కమిషనర్​కు హైకోర్టు నోటీసులు
  • అమీన్​పూర్​లో ఆస్పత్రిబిల్డింగ్ కూల్చివేతపై వ్యక్తిగతంగాహాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం 
  • కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగాకూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం 
  • అమీన్​పూర్ తహసీల్దార్ కూడా విచారణకు రావాలని ఆర్డర్

హైదరాబాద్, వెలుగు: హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్ పూర్ తహసీల్దార్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అమీన్ పూర్ లో ఆస్పత్రి బిల్డింగ్ కూల్చివేతపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వ్యక్తిగతంగా హాజరుకాలేని పక్షంలో ఆన్ లైన్ ద్వారా హాజరుకావాలని సూచించింది. కోర్టు పరిధిలోని పిటిషన్లపై విచారణ ముగిసేదాకా ఆ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోవద్దని, జీవో 99 రూల్స్ పాటించాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్, అమీన్ పూర్ తహసీల్దార్ ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌‌‌‌పూర్‌‌‌‌ మండలం కిష్టారెడ్డి పంచాయతీ పరిధిలోని శ్రీకృష్ణనగర్‌‌‌‌లో ఆస్పత్రి బిల్డింగ్ ను హైడ్రా ఇటీవల కూల్చివేసింది. అయితే దీనిపై ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తుండగా.. సర్వే నెంబర్164లోని ప్రభుత్వ స్థలంలో ఉన్న ఆస్పత్రి భవనాన్ని 48 గంటల్లో తొలగించాలంటూ ఈ నెల 20న యాజమాన్యానికి తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. 

ఈ నోటీసులను సవాల్ చేస్తూ గణేశ్ కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌, డాక్టర్‌‌‌‌ మహమ్మద్‌‌‌‌ రఫీ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది నరేందర్‌‌‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ నెల 20వ తేదీతో జారీ చేసిన నోటీసులను 21న సాయంత్రం 6:30 గంటలకు అందజేశారు. 22న ఉదయం 7:30గంటలకు జేసీబీ, బుల్డోజర్లు, 50మంది సిబ్బందితో వచ్చిన హైడ్రా.. ఐదంతస్తుల ఆస్పత్రి భవనాన్ని కూల్చివేసింది. సర్వే నెంబర్ 165, 166లోని మహమ్మద్‌‌‌‌ రఫీకి చెందిన 270 గజాల స్థలాన్ని గణేశ్ కన్‌‌‌‌స్ట్రక్షన్స్ కొనుగోలు చేసింది. ఇందులో 2022 నవంబర్ 10న పంచాయతీ అనుమతితో బిల్డింగ్ నిర్మించింది. కానీ హైడ్రా అక్రమ నిర్మాణమంటూ నోటీసులిచ్చి, ఆ వెంటనే కూల్చివేతలు చేపట్టింది” అని చెప్పారు.