- టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: గ్రూప్–1 పోస్టుల భర్తీలో రిజర్వేషన్లను నిబంధనల ప్రకారం అమలు చేయకపోవడంపై టీజీపీఎస్సీకి, ప్రభుత్వానికి గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 27వ తేదీకి వాయిదా వేసింది. గ్రూప్–1 పోస్టుల భర్తీకి సంబంధించి జీవో 55కు సవరణ తీసుకు వస్తూ జారీ చేసిన జీవో 29ను సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన ఎం.హనుమాన్ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.శరత్ గురువారం విచారణ చేపట్టారు.
Also Read:-పల్లెకు పోయి పెండ్లి చేస్కుంటే పైసలు
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గ్రూప్–1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదన్నారు. టీజీపీఎస్సీ 563 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఇందులో జనరల్ పోస్టులు 209, ఈడబ్ల్యూఎస్ 49, బీసీ(ఏ) 44, బీసీ (బీ)37, బీసీ(సీ) 13, బీసీ(డీ) 22, బీసీ(ఈ) 16, ఎస్సీ 93, ఎస్టీ 52, క్రీడాకారులు 4, దివ్యాంగులు 24 పోస్టులున్నాయన్నారు. ప్రతి కేటగిరీలో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంలో టీజీపీఎస్సీ నిబంధనలు పాటించలేదన్నారు. ఇది సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపారు.