- బీసీఐ, రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల షెడ్యూల్ ను సమర్పించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)తోపాటు రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పాలకవర్గం గడువుతోపాటు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తదుపరి విచారణలోగా సమర్పించాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. బార్ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ అడ్వకేట్ కె.అశోక్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారించారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రసాద్ వాదిస్తూ..ప్రస్తుతం బార్ కౌన్సిల్ సభ్యుల 5 ఏండ్ల పదవీ కాలం ముగిసిందని చెప్పారు. బీసీఐ 6నెలలు గడువు పొడిగించిందని, ఆ గడువు కూడా ముగిసిపోయిందన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు న్యాయవాది వాదిస్తూ..బార్ కౌన్సిళ్లలో సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీసింగ్ జరుగుతోందని తెలిపారు. వాదనలను విన్న జడ్జి.. బార్ కౌన్సిల్ ఎన్నికల షెడ్యూల్ వివరాలు సమర్పించాలని ఆదేశించి, విచారణను వాయిదా వేశారు.