ఫార్మా సిటీ ఉంటుందో..లేదో చెప్పండి

  • ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మా సిటీ ఏర్పాటుపై నిర్ణయం ఏంటో చెప్పాలని ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫార్మా సిటీని కొనసాగిస్తున్నారా? లేదా? అన్న దానిపై సంబంధిత అధికారి స్పష్టత ఇవ్వాలని కోరింది.

ఫార్మా సిటీ ఏర్పాటుకు సేకరించిన భూముల పరిహార అవార్డు చెల్లదంటూ సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తమ భూములపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ మేడిపల్లికి చెందిన రామచంద్రయ్య మరో 48 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ మంగళవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న తర్వాత ఈ విషయాన్ని సంబంధిత అధికారి వెల్లడించాలని పేర్కొంటూ విచారణను 6వ తేదీకి వాయిదా వేశారు.