ముగ్గురు ఐఏఎస్​లకు ధిక్కరణ నోటీసులు

 ముగ్గురు ఐఏఎస్​లకు ధిక్కరణ నోటీసులు
  • 15 ఏండ్లుగా పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: దశాబ్దామన్నర క్రితం తీసుకున్న భూములకు పరిహారం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై ముగ్గురు ఐఏఎస్‌‌‌‌‌‌‌‌లతో పాటు భూసేకరణ ప్రత్యేక అధికారికి హైకోర్టు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయనందుకు కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో ఈ నెల 18న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌‌‌‌‌‌‌‌ బొజ్జ, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె. రామకృష్ణారావు, వనపర్తి జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆదర్శ్‌‌‌‌‌‌‌‌ సురభిలతో పాటు వనపర్తి భూసేకరణ అధికారి డి. సుబ్రమణ్యంకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ఎడమ ప్రధాన కాలువకు సమాంతర కాలువ నిర్మాణం కోసం 2009లో భూసేకరణ చేపట్టి 2010లో అవార్డు ప్రకటించినా, కోర్టు వివాదాల్లో అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినప్పటికీ పరిహారం చెల్లించకపోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు మూడు నెలల్లో పరిహారం మొత్తాన్ని డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ, వాటిని అమలు చేయకపోవడంతో మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా ఆత్మకూరుకు చెందిన కె. జగదీశ్వర్‌‌‌‌‌‌‌‌ మరో అయిదుగురు హైకోర్టులో  కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌ ను జస్టిస్‌‌‌‌‌‌‌‌ సి.వి.భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇటీవల విచారించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన ఆస్తిహక్కుకు భంగం కలిగించడమే కాకుండా ఆర్టికల్ 14, 21కి విరుద్ధమని వివరించారు.

ప్రతి పౌరుడు గౌరవంగా జీవించే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిందన్నారు. ప్రభుత్వం తనకున్న అధికారంతో భూసేకరణ చేపట్టిందని, అయితే పరిహారం మాత్రం చెల్లించలేదన్నారు. దీనివల్ల వ్యవసాయ భూమిని కోల్పోయిన రైతులు జీవనోపాధి కోసం రోడ్డున పడ్డారన్నారు. తమ ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో ఈనెల 28న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు.