
- ఫోన్ ట్యాపింగ్ కేసు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఫిబ్రవరి 5 వరకు అరెస్టు చేయొద్దని పోలీసులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను మంగళవారం జస్టిస్ కె.లక్ష్మణ్ మరోసారి పొడిగించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పీఎస్‌లో తనపై నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని హరీశ్ రావు పిటిషన్ వేశారు. పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ వాదిస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు చెప్పారు. దీంతో విచారణను హైకోర్టు వచ్చే నెల 5కు వాయిదా వేసింది.
అప్పటివరకు హరీ శ్ ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. కాగా, చక్రధర్ గౌడ్‌పై అత్యాచారం, కిడ్నాప్ వంటి 11 కేసులు ఉన్నాయని, రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఫిర్యాదు చేశారని హరీశ్ రావు అఫిడవిట్ దాఖలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై కేసు నమోదు చేశారన్నారు.