కోకాపేట భూములపై బీఆర్ఎస్ కు హైకోర్టు నోటీసులు

కోకాపేట భూములపై బీఆర్ఎస్ కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట్‌‌‌‌ మండలం కోకాపేట్‌‌‌‌లో 11 ఎకరాల భూకేటాయింపుపై బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ‘ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఫర్‌‌‌‌ ఎక్సలెన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ హ్యూమన్‌‌‌‌ రిసోర్స్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌’ పేరిట బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీకి 2023లో అప్పటి ప్రభుత్వం 11 ఎకరాలను కేటాయించింది.

ఇందుకు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎకరాకు రూ.3.41 కోట్ల చొప్పున చెల్లించింది. కాగా, ఆ భూమి తమదంటూ సికింద్రాబాద్‌‌‌‌కు చెందిన అశోక్‌‌‌‌ దత్‌‌‌‌ జైశ్రీ, ఇతర కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఆ భూమిలో బీఆర్ఎస్ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఆ పిటిషన్ ను జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ బుధవారం విచారించారు. కోకాపేట్‌‌‌‌లో బీఆర్ఎస్ కు 11 ఎకరాలు భూకేటాయింపుపై పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అక్కడ నిర్మాణాలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ల వినతిని తిరస్కరించారు.విచారణను వచ్చే నెల 22కి వాయిదా వేశారు.