హైదరాబాద్, వెలుగు: ర్యాగింగ్ కేసు అభియోగాలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్ అలి ఖాన్ పై సస్పెన్షన్ ఎత్తివేసి పరీక్షలకు అనుమతి ఇవ్వాలన్న ఉత్తర్వులను అమలు చేయలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ లో కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ర్యాగింగే డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారణమని ఖాన్ ను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సస్పెన్షన్ రద్దు చేస్తూ వచ్చే జనవరిలో జరిగే పీజీ పరీక్షలకు అనుమతించాలని గతంలో కోర్టు ఆదేశాలిచ్చింది.
ఇవి అమలు కావడంలేదంటూ డాక్టర్ సైఫ్ అలీఖాన్ కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామ కుమార్ రెడ్డిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ కె. లక్ష్మణ్ ఇటీవల విచారించారు. వాదనలు విన్ని తర్వాత ప్రిన్సిపాల్ కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను డిసెంబరు 27కు వాయిదా వేశారు.