
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనల నిషేధంపై ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఉన్నత విద్యాశాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిరసనలను నిషేధిస్తూ ఈ నెల 13న జారీ చేసిన సర్క్యులర్‌పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో నినాదాలు చేయకూడదంటూ, నిరసనలు చేపట్టరాదంటూ ఈ నెల 13న జారీ చేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ న్యాయ విద్యార్థి పి.రఫీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అక్రమ చొరబాటు, ధర్నాటు, నిరసనలు వ్యక్తం చేయడం, నినాదాలు చేయడం, పరిపాలనా వ్యవహారాలను అడ్డుకోవడం, అధికారులు, సిబ్బందికి వ్యతిరేకంగా దూషణలు, అసభ్య పదజాలం వాడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సర్క్యులర్ జారీ అయిందని తెలిపారు.
ఈ సర్క్యులర్ భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని చెప్పారు. నిరసన ప్రాథమిక హక్కు అంటూ సుప్రీం కోర్టు తెలియజేసిందన్నారు. అస్పష్టంగా ఉన్న సర్క్యులర్‌ను కొట్టేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఉస్మానియా యూనివర్సిటీ, ఉన్నత విద్యాశాఖకు నోటీసులు జారీ చేశారు.